రష్యన్ మహిళలతో సంబంధాలను అంగీకరించిన బిల్ గేట్స్ – ఎప్‌స్టీన్ వ్యవహారంలో క్షమాపణలు!

వాషింగ్టన్: ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదంలో చిక్కుకున్న మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, తన స్వచ్ఛంద సంస్థ (Gates Foundation) ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో తనకు ఉన్న సంబంధాలు ఒక “పెద్ద తప్పు” అని ఆయన అంగీకరించారు.

లైంగిక నేరాలకు పాల్పడి శిక్ష అనుభవించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన వేలాది పత్రాలను ఇటీవల అమెరికా న్యాయశాఖ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకుల జాబితాలో బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో, తన ఫౌండేషన్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ ఈ విషయాలపై స్పందించారు.

ఈ సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్నట్లుగా తనకు ఇద్దరు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అయితే, ఆ మహిళలు ఎప్‌స్టీన్ వల్ల బాధితులుగా మారిన వారు కాదని ఆయన స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం, తన ఫౌండేషన్ ఉన్నతాధికారులను ఆయనతో సమావేశాలకు పంపడం వంటివి పెద్ద తప్పని, దీనివల్ల సంస్థ ప్రతిష్టకు భంగం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు.

“నేను చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదు. నా కళ్లముందు చట్టవిరుద్ధమైన పనులు జరగడం కూడా చూడలేదు. స్పష్టంగా చెప్పాలంటే, ఎప్‌స్టీన్ చుట్టూ ఉన్న బాధితులతో నేను ఎలాంటి సమయం గడపలేదు” అని గేట్స్ వివరించారు. 2014 వరకు ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు, ఆయన ప్రైవేట్ జెట్ విమానంలో ప్రయాణించినట్లు మరియు జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్ ప్రాంతాల్లో ఆయనతో గడిపినట్లు ఒప్పుకున్నారు. అయితే, ఎప్‌స్టీన్‌కు చెందిన వివాదాస్పద ద్వీపానికి (Little St. James Island) తాను ఎప్పుడూ వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: