సైబీరియాలోని మంచుతో కప్పబడిన ప్రాంతంలో ఉన్న ఆ పరిశోధనా కేంద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. కానీ, గత కొద్ది రోజులుగా అక్కడి నుంచి బయటకు వస్తున్న వార్తలు రష్యా వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతను, భయాందోళనలను సృష్టించాయి.
ఇర్కుట్స్క్ ప్రాంతంలోని ‘యాంటీ-ప్లేగు’ పరిశోధనా కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల దర్యా షిపిలోవా అనే యువతి, సెప్టెంబర్ 29న తీవ్రమైన న్యుమోనియా (ఊపిరితిత్తుల వాపు)తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ సహాయంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ, దురదృష్టవశాత్తు ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆమె మృతి చెందారు.
ఆమె చనిపోయిన వార్త వెలువడగానే, ఆ ప్రాంతమంతా రాత్రికి రాత్రే హై అలర్ట్‌కు వెళ్లిపోయింది. కారణం, ఆమె పనిచేసింది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు చేసే కేంద్రంలో కావడం! ఈ మరణం చుట్టూ ఇప్పుడు అనేక ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి.
ఆసుపత్రి సిబ్బందితో దర్యా మాట్లాడుతూ.. “తాను ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ లైవ్ బ్యాక్టీరియాతో ఉన్న ఒక టెస్ట్ ట్యూబ్‌ను పగలగొట్టానని” చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఆమె మంగోలియా సరిహద్దు సమీపంలో ఒక ఫీల్డ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడే అనారోగ్యానికి గురైందని మరో సమాచారం.
అయితే, ఆమె థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఆసుపత్రిలో చేరిందని ఇంకో వార్త చెబుతోంది. రష్యా ప్రజారోగ్య పర్యవేక్షణ సంస్థ ‘రోస్పోтребనాడ్జోర్’ (Rospotrebnadzor) మాత్రం ల్యాబ్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె శరీరంలో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు ఏవీ కనుగొనబడలేదని స్పష్టంగా ఖండించింది. ఆమె కేవలం “కారణం తెలియని న్యుమోనియా”తో మాత్రమే మరణించిందని తెలిపింది.
అధికారులు “పరిస్థితి అదుపులోనే ఉంది” అని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు మరో కథను చెబుతున్నాయి. దర్యాను కలిసిన 197 మందిని వెంటనే గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉంచారు. ఆమె చికిత్స పొందిన షెలెకోవ్ ఆసుపంత్రితో పాటు, ఆ ప్రాంతంలోని సుమారు 4 ప్రభుత్వ ఆసుపత్రులు, ఒక ప్రసూతి వార్డులో 3 వారాల పాటు కఠినమైన ఆంక్షలు విధించారు. సమీపంలోని అల్యూమినియం ప్లాంట్ కార్మికులందరూ విధిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు.
దీనికి ప్రధాన కారణం ‘న్యుమోనిక్ ప్లేగు’ గురించిన భయమే! చారిత్రక ‘బ్లాక్ డెత్’ వ్యాప్తికి కారణమైన ప్లేగు వ్యాధికి ఇది తీవ్ర రూపం. ఇది గాలి ద్వారా తుంపర్ల రూపంలో మనిషి నుంచి మనిషికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ప్రారంభంలోనే గుర్తిస్తే యాంటీబయాటిక్స్ ద్వారా నయం చేయవచ్చు, కానీ ఆలస్యమైతే ప్రాణాలను బలిగొంటుంది.
దీనితో, రష్యా చీఫ్ హెల్త్ ఆఫీసర్ అన్నా పోపోవా హుటాహుటిన మాస్కో నుంచి ఇర్కుట్స్క్కు చేరుకుని అత్యవసర సమావేశం నిర్వహించారు. పొరుగున ఉన్న బురియాటియా ప్రాంత గవర్నర్ మొదట ఆ యువతి ప్లేగు వ్యాధితో చనిపోయి ఉండవచ్చని చెప్పి, ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అలాగే కొన్ని స్థానిక ప్రభుత్వ విభాగాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హెచ్చరికలను కూడా తర్వాత తొలగించాయి.
అక్టోబర్ 5 నాటికి, రష్యాలో ప్లేగు వ్యాధి ప్రబలినట్లు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. కానీ, ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములపై పరిశోధనలు చేసే మహిళా ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం, ఆ తర్వాత దాదాపు 200 మందిని క్వారంటైన్ చేయడం వంటి చర్యలు ప్రపంచ దేశాల దృష్టిని తీవ్రంగా ఆకర్షిస్తూనే ఉన్నాయి.

Leave a Reply