రష్యా నుంచి రావాల్సిన అణు ఇంధనం.! గగనతల అనుమతి నిరాకరించిన పాకిస్థాన్.! సాంకేతిక లోపమంటూ వివరణ.!!!

బంగ్లాదేశ్‌లోని రూప్పూర్ అణువిద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌కు అవసరమైన అణు ఇంధనాన్ని తీసుకొస్తున్న రష్యా విమానం ఆలస్యమైంది. పాకిస్థాన్ గగనతల మార్గాన్ని ఉపయోగించేందుకు అనుమతి లభించకపోవడంతో ఈ జాప్యం జరిగినట్లు సమాచారం.

సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌కు చేరుకోవాల్సిన యురేనియం సరుకు అనుకున్న సమయానికి చేరుకోలేదు. దీనిపై స్పందించిన పాకిస్థాన్.. ఈ వ్యవహారం సాంకేతిక, విధానపరమైన అంశాలకు సంబంధించినదని వెల్లడించింది. ప్రస్తుతం అక్టోబర్ మొదటి వారంలో అణు ఇంధనం బంగ్లాదేశ్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢాకాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గగనతల మార్గాన్ని ఉపయోగించేందుకు వచ్చే అనుమతి అభ్యర్థనలను అంతర్జాతీయ నిబంధనలు, విధివిధానాలకు అనుగుణంగా పరిశీలిస్తారు.

సదరు విమానం మార్గం, గగనతల అనుమతికి సంబంధించిన కొన్ని సాంకేతిక, విధానపరమైన సమస్యల కారణంగా విమాన ప్రయాణ ప్రణాళికలో మార్పు జరిగి ఉండవచ్చని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తెలిపింది.

అదే సమయంలో బంగ్లాదేశ్‌తో సంబంధాలకు పాకిస్థాన్ ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ వ్యవహారాన్ని కేవలం సాంకేతిక అంశంగానే చూడాలని పేర్కొంది.

బంగ్లాదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫకీర్ మహబూబ్ అనామ్ మాట్లాడుతూ.. రూప్పూర్ అణువిద్యుత్ కేంద్రానికి అవసరమైన యురేనియాన్ని తీసుకొస్తున్న సరుకు విమానం సెప్టెంబర్ 24న రావాల్సి ఉందని తెలిపారు.

సరుకును స్వీకరించేందుకు విమానాశ్రయంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ.. పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించేందుకు అనుమతి లభించకపోవడంతో విమానాన్ని నడపలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు.

రష్యా అణుశక్తి సంస్థ రోసాటమ్ అక్టోబర్ మొదటి వారంలో మరో విమాన ప్రయాణాన్ని నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థ సాంకేతిక సహకారంతో బంగ్లాదేశ్ తొలి అణువిద్యుత్ కేంద్రం రూప్పూర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది.

ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రెండు VVER-1200 అణు రియాక్టర్లు నిర్మిస్తున్నారు. మొత్తం 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

మొదటి యూనిట్‌కు అవసరమైన అణు ఇంధనాన్ని 2023లో రష్యా నుంచి బంగ్లాదేశ్‌కు తరలించారు.

ఇప్పుడు రెండో యూనిట్‌కు అవసరమైన అణు ఇంధనం రాక ఆలస్యం కావడంతో.. కొత్త విమాన ప్రయాణ తేదీ కోసం బంగ్లాదేశ్ అధికారులు ఎదురుచూస్తున్నారు.


Posted

in

by

Tags: