జీవితంలో కష్టసుఖాలు రెండూ వస్తూ ఉంటాయి. పరిస్థితులు అనుకూలించనప్పుడు చాలామంది భయపడి, ప్రతికూల ఆలోచనలతో త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. కానీ, అలాంటి సమయంలోనే ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుక్కోవాలి. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఇక్కడ ఉంది.
అసలేం జరిగింది? ఒకానొక చలికాలంలో, రాజుగారు ఎండలో దర్బారు ఏర్పాటు చేశారు. అక్కడ పండితులు, విద్వాంసులు, సామాన్య ప్రజలు ఉన్నారు. అప్పుడు ఒక అపరిచితుడు అక్కడికి వచ్చి, “రాజా, నా దగ్గర రెండు వస్తువులు ఉన్నాయి. ఒకటి విలువైన వజ్రం, రెండోది గాజు ముక్క. రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. ఎవరైనా నిజమైన వజ్రాన్ని గుర్తుపడితే అది వారిదే, లేదంటే వజ్రం విలువైనంత ధనాన్ని నాకు ఇవ్వాలి” అని సవాలు విసిరాడు.
విద్వాంసుల పరాజయం.. అంధుడి విజయం! రాజుగారు ఆ సవాలును స్వీకరించారు, కానీ ఆ వజ్రానికి, గాజుకు తేడాను కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత సభలోని విద్వాంసులు కూడా విఫలమయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక అంధుడు ముందుకు వచ్చి, “రాజా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి” అని కోరాడు. అందరూ అతన్ని చూసి నవ్వుకున్నా, రాజు అనుమతించారు. ఆ అంధుడు ఆ రెండు వస్తువులను చేతిలోకి తీసుకోగానే, ఏది వజ్రమో ఖచ్చితంగా చెప్పేశాడు.
ఆ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు అతన్ని, “నువ్వు దీనిని ఎలా గుర్తుపట్టావు?” అని అడిగారు. దానికి ఆ అంధుడు, “రాజా, నేను రెండింటినీ చేతిలోకి తీసుకోగానే ఒకటి చల్లగా ఉంది, రెండోది వేడిగా ఉంది. గాజు ముక్క ఎండలో త్వరగా వేడెక్కుతుంది, కానీ వజ్రం ఎంత ఎండలో ఉన్నా చల్లగానే ఉంటుంది” అని చెప్పాడు. అతని తెలివితేటలను చూసి సభికులందరూ ముక్కున వేలేసుకున్నారు.
నీతి: ఈ కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే—కష్టకాలంలో లేదా క్లిష్ట పరిస్థితుల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరైతే ప్రశాంతమైన, సానుకూల (Positive) ఆలోచనలతో ఉంటారో, వారు ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు. కోపంతో, ఆందోళనతో ఉండే వ్యక్తి గాజు ముక్కలాంటి వాడు, ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొనేవాడు వజ్రం లాంటి వాడు.
