రాత్రి వేళల్లో కొందరికి చర్మంపై దురద రావడం సహజం. శరీర ఉష్ణోగ్రతలో మార్పులు, చర్మం పొడిబారడం మరియు హార్మోన్ల హెచ్చుతగ్గులు రాత్రి వేళ దురదకు ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
దీనిని ప్రారంభంలోనే పట్టించుకోకపోతే రాత్రి నిద్ర దూరం కావడంతో పాటు మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
చర్మం తగినంత తేమను కోల్పోయినప్పుడే విపరీతమైన దురద మొదలవుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో మేల్కొని ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత మారి చర్మం మరింత పొడిబారుతుంది. దీనిని నివారించి చర్మాన్ని తేమగా ఉంచేందుకు పడుకునే ముందు వైద్యుల సలహాతో సరైన మాయిశ్చరైజర్ లేదా మాయిశ్చరైజింగ్ క్రీములను రాసుకోవచ్చు.
రాత్రి పూట చర్మ సమస్యలను తగ్గించి ఇన్ఫెక్షన్లు రాకుండా చేయడంలో స్నానం ఎంతగానో తోడ్పడుతుంది. చర్మం తేమగా ఉండేందుకు ఓట్స్ బాత్ లేదా గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని స్నానం చేయడం మంచిది. అయితే, ఇవి మీ చర్మతత్వానికి సరిపోతాయో లేదో నిర్ధారించుకున్నాకే ఉపయోగించాలి.
చర్మం పూర్తిగా పొడిబారిపోకుండా ఉండటానికి దురద ఉన్న చోట తడి గుడ్డతో అప్పుడప్పుడు తుడుచుకోవచ్చు. రాత్రి వేళల్లో ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా తేమతో ఉంటుంది. ఇది దురద నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చి ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది.
దురద సమస్యతో బాధపడేవారు దుస్తుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉన్ని, పాలిస్టర్ మరియు శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల చర్మంపై మంట, చికాకు పెరుగుతాయి. కాబట్టి శరీరానికి చక్కగా గాలి తగిలే శుభ్రమైన, తేలికపాటి కాటన్ (నూలు) దుస్తులను రాత్రి పూట ధరించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Leave a Reply