రాత్రి మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి ఉదయం తిన్న యువకుడు.. కాళ్లు, వేళ్లు కోల్పోయాడు! మీరు జాగ్రత్త!

ప్రస్తుత బిజీ జీవనశైలిలో రాత్రి మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో దాచి మరుసటి రోజు తినడం చాలామందికి అలవాటు. కానీ ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ ఘటన రుజువు చేస్తోంది. రాత్రి మిగిలిన ఆహారం తినడం వల్ల ఒక యువకుడు తన రెండు కాళ్లను, వేళ్లను కోల్పోయి జీవితాంతం వైకల్యంతో బతకాల్సి వచ్చింది.

ఏం జరిగింది? ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ నివేదిక ప్రకారం, ‘జెసీ’ అనే విద్యార్థి తన స్నేహితుడు హోటల్ నుంచి తెచ్చిన నూడుల్స్ మరియు చికెన్‌ను రాత్రి ఫ్రిజ్‌లో ఉంచాడు. మరుసటి రోజు ఉదయం అదే ఆహారాన్ని తిన్న తర్వాత అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తీవ్రమైన జ్వరంతో పాటు శరీరంపై ఊదా రంగు మచ్చలు రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

తీవ్రమైన ఇన్ఫెక్షన్: వైద్య పరీక్షల్లో అతని కిడ్నీలు పనిచేయడం లేదని, శరీరంలో విషతుల్యాలు (సెప్సిస్) వ్యాపిస్తున్నాయని తేలింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా అతడి ప్రాణాలను కాపాడటం వైద్యులకు సవాలుగా మారింది. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించకుండా ఉండేందుకు, వైద్యులు అతని వేళ్లను, మోకాళ్ల కింద నుండి రెండు కాళ్లను తొలగించాల్సి వచ్చింది. దాదాపు 26 రోజుల పాటు కోమాలో ఉన్న జెసీ, చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, జీవితాంతం అంగవైకల్యంతో మిగిలిపోయాడు.

సెప్సిస్ అంటే ఏమిటి? శరీరంలో ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడే క్రమంలో కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ ప్రతిచర్య అదుపు తప్పినప్పుడు ‘సెప్సిస్’ కలుగుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందన పెరగడం వంటివి దీని ప్రధాన లక్షణాలు.

జాగ్రత్తలు: హోటల్ ఆహారంలో ఆ బాక్టీరియా ఎక్కడ నుండి వచ్చిందనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ ఘటన మనకు ఒక హెచ్చరిక. ఎల్లప్పుడూ తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. రాత్రి మిగిలిన ఫ్రిజ్ ఆహారానికి దూరంగా ఉండటమే మంచిది.


Posted

in

by

Tags: