బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిల్క్ బోర్డ్ రోడ్డు ప్రాంతంలో దారుణం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువతిని, మరో బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు వెంబడించి లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ఆ యువతి వెనుక వస్తున్న ఒక కారుకు ఉన్న ‘డాష్ బోర్డ్’ (Dash Board) కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఒకే బైక్పై నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు యువకులు ప్రయాణించడం, వారు హెల్మెట్ ధరించకపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ముగ్గురు యువకులు కలిసి ఆ యువతిని దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర వెంబడించారని ఆ వీడియోను షేర్ చేసిన కారు యజమాని తెలిపారు. ఆధారాల కోసం వీడియో తీసిన తర్వాత, తాను ఆ యువకులను అడ్డుకోవడానికి ప్రయత్నించానని, కానీ వారు అక్కడి నుండి తప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు వెంటనే స్పందించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారు ప్రయాణించిన బైక్ యజమాని వివరాలను ఇప్పటికే సేకరించామని, త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
