ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా సేవలు పొందుతున్నప్పుడు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అన్యా విగ్ అనే యువతి ‘లింక్డ్ఇన్’ (LinkedIn) వేదికగా పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
ఏం జరిగింది? ఢిల్లీకి చెందిన అన్యా, రాత్రి 11 గంటల సమయంలో ‘జొమాటో’ (Zomato) యాప్ ద్వారా ‘పాన్’ (Paan) ఆర్డర్ చేశారు. ఆర్డర్ డెలివరీ కాగానే దాన్ని తీసుకోవడానికి ఆమె ఒంటరిగా బయటకు వచ్చారు. ఆ సమయంలో డెలివరీ బాయ్ ఆమెతో అనవసరమైన ప్రశ్నలు వేయడం ప్రారంభించాడు. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నప్పటికీ, ఆ వ్యక్తి వదలలేదు. “ఈ వయసులో ఒక ఆడపిల్లవై ఉండి ఇలాంటి పాన్ ఆర్డర్ చేస్తున్నావేంటి?” అంటూ ఆమెను అసభ్యకరంగా విమర్శించాడు.
ఈ ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్యా, “మేము ఏమి ఆర్డర్ చేస్తున్నామో చూసి, మాతో వాదించడానికి డెలివరీ సిబ్బందికి ఎవరు అధికారం ఇచ్చారు?” అని సదరు సంస్థను నిలదీశారు.
అభద్రతా భావం: ఈ ఘటనలో అన్యా వ్యక్తం చేసిన మరో ఆందోళన చాలా మంది మహిళల నిజ జీవితంలోని భయం. డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోవచ్చు, కానీ ఒకవేళ అతని ఈగో దెబ్బతింటే.. తాను ఎక్కడ ఉంటున్నానో అతనికి తెలుసు కాబట్టి, తనకు ఏదైనా అపాయం జరుగుతుందేమోనని ఆమె ఆందోళన చెందారు.
స్పందించిన సంస్థ: ఈ పోస్ట్‌పై స్పందించిన జొమాటో సంస్థ, వెంటనే ఆర్డర్ వివరాలను పంపమని అభ్యర్థించింది. అప్పటికే ఈ పోస్ట్ కింద వందలాది మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా వస్తువులు ఆర్డర్ చేసేటప్పుడు, తాము ఇంట్లో ఒంటరిగా ఉన్నామని తెలియకూడదని ఇంట్లో ఎవరో ఉన్నట్లు నటిస్తామని చాలామంది మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలో డెలివరీ సిబ్బందికి సంస్థలు కచ్చితంగా శిక్షణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
