డబ్లిన్: భారత క్రికెట్ రంగంలో ఎదుగుతున్న అత్యంత పిన్న వయస్కుడైన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అంతర్జాతీయ క్రికెట్లో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించడానికి సిద్ధమయ్యాడు. జూనియర్ క్రికెట్, దేశవాళీ టోర్నీలు, ఇండియా ‘ఎ’ జట్టు మరియు ఐపీఎల్ (IPL) లో తన దూకుడైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించిన అతను, ఇప్పుడు భారత టీ20 జట్టులోనూ స్థానం సంపాదించుకున్నాడు.
ఈరోజు (జూన్ 26) ఐర్లాండ్ జట్టుతో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అతను తుది జట్టులో ఆడితే, భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నిలిచి, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
అతను పుట్టుకతోనే ప్రత్యేకమైన ఆటగాడు – రాహుల్ ద్రావిడ్ ప్రశంసలు:
వైభవ్ సూర్యవంశీలోని అసాధారణ ప్రతిభను గుర్తించి, ఐపీఎల్లో ఆడే అవకాశం కల్పించిన రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్, భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఈ యువ ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించారు. బౌలర్ల వేగాన్ని మరియు లెంగ్త్‌ను చాలా త్వరగా అంచనా వేసే అద్భుతమైన నైపుణ్యం వైభవ్‌కు ఉందని ద్రావిడ్ కొనియాడారు. బిబిసి (BBC) కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అతనికున్న క్రికెట్ పరిజ్ఞానం, నిర్భయంగా ఆడే శైలి అతన్ని ఒక ‘స్పెషల్ ప్లేయర్’గా మారుస్తున్నాయని పేర్కొన్నారు.
సహజ సిద్ధమైన ప్రతిభ – సరైన మార్గదర్శకత్వం అవసరం:
ఇలాంటి అసాధారణ ప్రతిభావంతులు పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను కలిగి ఉంటారని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో ఉన్నప్పుడు వైభవ్ పడిన కష్టాన్ని, నెట్స్‌లో అతను ఎదుర్కొన్న వేలాది బంతుల అభ్యాసాన్ని తాను స్వయంగా చూశానని గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వైభవ్‌కు సరైన మార్గదర్శకత్వం, మద్దతు అందించాలని.. అతని సహజ సిద్ధమైన స్వేచ్ఛాయుత ఆటతీరుకు ఆటంకం కలిగించకుండా జాగ్రత్తగా ముందుకు నడిపించాలని ద్రావిడ్ సూచించారు.
