హనీమూన్, ట్రిప్ లేదా ట్రావెలింగ్ కోసం దేశ విదేశాలు చుట్టే నూతన వధూవరులు మరియు ప్రేమికులు హోటల్ గదులను బుక్ చేసుకుంటారు. అక్కడ తమకంటూ కొంత వ్యక్తిగత గోప్యత (Privacy) ఉంటుందని ఆశిస్తారు. అయితే, రూమ్ బుక్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు పెద్ద సమస్యల్లో చిక్కుకోవచ్చు. అందుకే లాడ్జ్ లేదా హోటల్ రూమ్ బుక్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. రూమ్ బుక్ చేసే ముందు హోటల్ రివ్యూలను తనిఖీ చేయడంతో పాటు కింద ఇచ్చిన భద్రతా నియమాలను పాటించండి.
1. రహస్య కెమెరాలను గుర్తించండి (Hidden Cameras): గదిలోకి ప్రవేశించిన తర్వాత ముందుగా అన్ని లైట్లు ఆర్పేసి, కిటికీ తెరలను పూర్తిగా మూసివేయండి. ఆపై మీ స్మార్ట్ఫోన్ కెమెరా ఆన్ చేసి గది అంతా పరిశీలించండి. చీకటిలో చాలా రహస్య కెమెరాలు ఎరుపు రంగులో మెరుస్తాయి. ఇవి కంటికి కనిపించవు కానీ ఫోన్ కెమెరాలో ఎరుపు లేదా ఊదా రంగు చుక్కలుగా కనిపిస్తాయి. టీవీ రిమోట్ బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు ఇలాంటి లైట్లను గుర్తించవచ్చు.
2. టార్చ్ లైట్ ద్వారా తనిఖీ: మీ మొబైల్ టార్చ్ ఆన్ చేసి గదిలోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఎక్కడైనా కెమెరా లెన్స్ ఉంటే, దానిపై కాంతి పడినప్పుడు అది మెరుస్తుంది. ముఖ్యంగా అద్దం లాగా మెరిసే నీలం లేదా ఊదా రంగు ప్రతిబింబం కనిపిస్తే అక్కడ కెమెరా ఉండే అవకాశం ఉంది. అద్దాలు, ఫర్నిచర్ మూలల్లో ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువ.
3. ఇతర వస్తువులపై నిఘా: అనేక రహస్య కెమెరాలు వై-ఫై (Wi-Fi) తో పనిచేస్తాయి. మీరు ‘Fing’ వంటి యాప్లను డౌన్లోడ్ చేసుకుని, ఆ నెట్వర్క్కు ఎన్ని పరికరాలు అనుసంధానమై ఉన్నాయో తనిఖీ చేయాలి. అనుమానాస్పదంగా ‘IP Camera’ అని కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. స్మోక్ డిటెక్టర్లు, అలారం గడియారాలు, టెడ్డీ బేర్లు మరియు పవర్ సాకెట్ల వంటి వస్తువులను జాగ్రత్తగా గమనించండి. అవసరమైతే వాటిని వేరే చోట పెట్టండి.
4. డిటెక్టర్లను వాడటం: మీకు కెమెరా ఉందనే అనుమానం బలంగా ఉంటే, ఆన్లైన్లో లభించే ‘RF డిటెక్టర్లు’ లేదా ‘లెన్స్ డిటెక్టర్లు’ కొనుగోలు చేసి మీతో ఉంచుకోవచ్చు. ఇవి కెమెరా నుండి వచ్చే రేడియో తరంగాలను గుర్తించగలవు.
5. ఉచిత వై-ఫై విషయంలో జాగ్రత్త: హోటల్లో ఇచ్చే ఉచిత వై-ఫైని వాడే ముందు జాగ్రత్తగా ఉండండి. చాలా అవసరమైతే తప్ప దానిని వాడకపోవడమే మంచిది. హోటల్ వై-ఫై వాడటం వల్ల ఇతరులు మీ ఫోన్ లేదా లాప్టాప్లోని డేటాను హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది.
