మహారాష్ట్రలోని కళ్యాణ్ పరిధిలో ఒక ట్యాక్సీ డ్రైవర్‌ను ఇద్దరు మహిళలు రూ.10,000 ఇవ్వాలంటూ బెదిరించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ భివాండి వైపు వెళ్తుండగా కారులో ఉన్న ఆ మహిళలు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే వేధింపుల తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపిస్తామని బెదిరింపులకు దిగారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కారు ప్రయాణిస్తున్న సమయంలోనే ఆ మహిళలు డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగడం, బూతులు తిడుతూ రెచ్చిపోవడం అందులో కనిపిస్తోంది. అంతేకాకుండా వారిలో ఒకరు డ్రైవర్‌పై భౌతిక దాడికి కూడా యత్నించినట్లు ఆ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ఏమాత్రం భయపడని ఆ డ్రైవర్, వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి కారును నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ వైపు మళ్లించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళలు డోర్ తెరవాలంటూ గట్టిగా కేకలు వేశారు. మార్గమధ్యంలో ఒక పోలీసు వాహనం కనిపించగానే, నెమ్మదిగా వెళ్తున్న ట్యాక్సీ నుంచి దూకేసి అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ ఘటన తాలూకు వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతుండగా, క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply