న్యూఢిల్లీ: భారతదేశపు ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన ఒక అరుదైన చిత్రం ఏకంగా రూ. 167.2 కోట్లకు వేలంలో అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. యశోద, కృష్ణుడు ఆవుతో కలిసి ఉన్న ఈ అద్భుత చిత్రాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు.
రాజా రవివర్మ ప్రత్యేకత:
భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ. ఆయన 1848లో ట్రావెన్కోర్ సంస్థానంలోని ఒక కులీన కుటుంబంలో జన్మించారు. చిత్రలేఖనంలో ఆయనది అందెవేసిన చేయి. 1894లో ఆయన ఒక లితోగ్రాఫిక్ ప్రెస్ను స్థాపించి, తను గీసిన చిత్రాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. యూరోపియన్ సాంకేతికతను ఉపయోగిస్తూనే, భారతీయ భావోద్వేగాలను జోడించి ఆయన చిత్రాలను సజీవంగా తీర్చిదిద్దేవారు. ముఖ్యంగా హిందూ దేవతల రూపాలు ఇలాగే ఉంటాయని మనం నేడు ఊహిస్తున్నామంటే దానికి ఆయన చిత్రాలే ప్రధాన కారణం.
రూ. 167.2 కోట్లకు వేలం:
రవివర్మ 1890లో ‘కృష్ణుడు తన పెంపుడు తల్లి యశోద మరియు ఆవుతో కలిసి ఉన్న’ చిత్రాన్ని గీశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ వేలం సంస్థ ‘సాఫ్రన్ ఆర్ట్’ (Saffronart) వేలానికి ఉంచింది. మొదట ఈ చిత్రం రూ. 80 కోట్ల నుండి రూ. 120 కోట్ల వరకు ధర పలుకుతుందని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఇది ఏకంగా రూ. 167.2 కోట్లకు అమ్ముడైంది.
దక్కించుకున్న పూనావాలా:
భారతీయ పారిశ్రామికవేత్త సైరస్ పూనావాలా ఈ చిత్రాన్ని వేలంలో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ అద్భుత చిత్రాన్ని దక్కించుకోవడాన్ని నేను ఒక అదృష్టంగా మరియు బాధ్యతగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని ప్రజలందరూ చూసేలా ప్రదర్శనకు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను” అని తెలిపారు.
పాత రికార్డులు కనుమరుగు:
సాఫ్రన్ ఆర్ట్ సహ వ్యవస్థాపకురాలు మినల్ వజిరానీ మాట్లాడుతూ.. “ఆర్ట్ మార్కెట్లో ఇది ఒక కొత్త మైలురాయి. ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, భారతీయ కళా సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటిచెబుతోంది” అన్నారు.
దీనికి ముందు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన ‘అన్ టైటిల్డ్’ (గ్రామ యాత్ర) చిత్రం రూ. 118 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. కిరణ్ నాడార్ ఆ చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు రవివర్మ గీసిన ‘యశోద-కృష్ణ’ చిత్రం ఆ రికార్డును అధిగమించి భారతీయ చిత్రలేఖన చరిత్రలో అత్యధిక ధర పలికిన చిత్రంగా మొదటి స్థానంలో నిలిచింది.
