ఢిల్లీలో క్యాబ్ ప్రయాణం ముగిసిన తర్వాత కేవలం ఒక్క రూపాయి చిల్లర కోసం ఒక మహిళా ప్రయాణికురాలికి, క్యాబ్ డ్రైవర్‌కు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రైడ్ ఛార్జీ రూ.199 కాగా, ఆ మహిళ డ్రైవర్‌కు రూ.200 నోటు ఇచ్చింది. మిగిలిన రూ.1 చిల్లర తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడే అసలు వివాదం మొదలైంది. ఒక్క రూపాయి కోసం ఇద్దరూ పట్టువీడకుండా గొడవపడిన ఈ ఘటన నెటిజన్లను నవ్విస్తోంది.
ప్రయాణం పూర్తయ్యాక మిగిలిన ₹1 చిల్లర ఇవ్వాలని ఆ మహిళ కోరగా, తన వద్ద చిల్లర లేదని డ్రైవర్ చెప్పాడు. దాంతో “ఛార్జీ రూ.199 అయినప్పుడు నేను రూ.200 ఎందుకు ఇవ్వాలి?” అని ఆమె నిలదీసింది. ఎలాగైనా తన ఒక్క రూపాయిని తిరిగి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దానికి డ్రైవర్ కూడా “చిల్లర లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి?” అని సమాధానమిచ్చాడు.
ఒక్క రూపాయే కదా అని ఎవరైనా వదిలేస్తారని అనుకుంటే, ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. మహిళ తన ₹1 వదులుకోనని అనడం, డ్రైవర్ తన వద్ద చిల్లర లేదని చెప్పడంతో వాగ్వాదం కాస్తా పెద్ద పంచాయితీగా మారింది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రూపాయికి బదులుగా చిన్న చాక్లెట్ లాంటివి ఇచ్చి రాజీ పడుతుంటారు, కానీ ఇక్కడ ఆ ఒక్క రూపాయి వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కొందరు మహిళ పట్టుదలను, మరికొందరు డ్రైవర్ పరిస్థితిని చూసి సరదాగా స్పందిస్తున్నారు. “యూపీఐ కాలంలో కూడా ఒక్క రూపాయి కోసం ఇంత పెద్ద రచ్చా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిల్లర సమస్య కూడా ఎలా సోషల్ మీడియా వైరల్ కంటెంట్‌గా మారుతుందో చెప్పడానికి ఈ వీడియో తాజా ఉదాహరణగా నిలిచింది.
