కోల్‌కతాలోని ఎన్.ఆర్.ఎస్ (NRS) వైద్య కళాశాల, ఆసుపత్రి సమీపంలో నడుస్తున్న రాజు ఘోష్ అనే వ్యక్తికి చెందిన హోటల్లో శనివారం ఉదయం ఆహార భద్రతా (ఫుడ్ సేఫ్టీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కేవలం 30 రూపాయలకే 3 పరోటాలు, అన్లిమిటెడ్ సబ్జీ (కూర), ఒక ఉడకబెట్టిన గుడ్డు అందిస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ హోటల్లో, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేయడానికి అధికారులు వచ్చారు.
తనిఖీల సమయంలో పరోటా, సబ్జీ, ఉడకబెట్టిన గుడ్డు నాణ్యతతో పాటు వాటిని ఉంచిన పాత్రలను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడే ఆ హోటల్‌కు అధికారిక ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్ నుంచి సేకరించిన ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపామని, టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆహార నాణ్యతపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఫుడ్ లైసెన్స్ లేదన్న వాస్తవాన్ని అంగీకరించిన రాజు ఘోష్, త్వరలోనే లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తనిఖీల సమయంలో.. వంట చేసే చోట పరిశుభ్రత పాటించాలని, ఎర్రటి గుడ్డకు బదులుగా శుభ్రమైన తెల్లటి గుడ్డను వాడాలని, ఉడకబెట్టిన గుడ్లను వేరే పాత్రలో ఉంచాలని అధికారులు సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులతో సహా ప్రతిరోజూ 100 మందికి పైగా కస్టమర్లు ఇక్కడ భోజనం చేస్తున్నందున, వారి ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యత అని హోటల్ యజమాని చెప్పారు.
కోల్‌కతాలో పండుగ సీజన్ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు చేపడుతున్నప్పటికీ, రాజు దుకాణాన్ని మూసివేయాలని అధికారులు ఆదేశించలేదు. అయితే, ల్యాబ్ పరీక్షల ఫలితాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
