రూ. 40 లక్షల విద్యా రుణం..! మంచి ఉద్యోగం రాకపోయినా మంచి స్నేహితులైతే దొరికారు.. 22 ఏళ్ల యువతి వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు.!

ప్రపంచంలోని అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన ‘ఇన్సీడ్’ (INSEAD) విశ్వవిద్యాలయంలో, ఏక్తా అగర్వాల్ (22) అనే యువతి తన 20వ ఏట రూ. 40 లక్షల విద్యా రుణం (ఎడ్యుకేషన్ లోన్) తీసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

విదేశీ చదువుల కోసం ఇంత పెద్ద మొత్తాన్ని అప్పుగా తీసుకోవడం సరైనదేనా? దీనివల్ల ఆశించిన ఫలితం ఉంటుందా? అనే సాధారణ ప్రశ్నకు సమాధానమిస్తూ ఏక్తా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. “చదువు వల్ల వచ్చే ప్రయోజనాన్ని కేవలం వచ్చే జీతాన్ని బట్టి మాత్రమే అంచనా వేయకూడదు” అని పేర్కొంది.

“మంచి విశ్వవిద్యాలయంలో చదివితే ఉద్యోగ అవకాశాల ద్వారా రుణాన్ని సులభంగా తీర్చేయవచ్చు. ఈ చదువు వల్ల నాకు 33 దేశాలలో స్నేహితులు దొరికారు; ప్రపంచవ్యాప్తంగా 20,000 కంటే ఎక్కువ మంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. 40 ఏళ్ల వయసులో కూడా లభించని అనుభవాలు నాకు 22 ఏళ్లకే వచ్చేసాయి. మీకున్న నెట్‌వర్కింగ్ (పరిచయాలు) మాత్రమే మీ అసలైన ఆస్తి” అని ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

ఏక్తా చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఒక వర్గం వారు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ, “మంచి గ్లోబల్ నెట్‌వర్క్ అనేది భవిష్యత్తుకు పెద్ద పెట్టుబడి లాంటిదే” అని ప్రశంసించారు. అయితే, మరో వర్గం వారు ఈ వాదనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. “విదేశీ స్నేహితులు మీకు కావాలంటే కాఫీ కొని ఇస్తారు కానీ, మీ నెలవారీ ఈఎంఐ (EMI)లు వారు కట్టరు కదా!” అని కొందరు ఎద్దేవా చేశారు.

“నువ్వు ఇంకా నిజ ప్రపంచంలోని కష్టాలను చూడలేదు”, “ఇరవై ఏళ్ల వయసులో ఇలా మాట్లాడటం చాలా చిన్నపిల్లలతనంగా ఉంది, ముప్పై ఏళ్లకు వస్తేనే జీవితంలోని అసలు నిజాలు అర్థమవుతాయి” అంటూ ఏక్తాకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. దీంతో విద్యా రుణం, దాని ద్వారా వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) గురించిన చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపిస్తోంది.


Posted

in

by

Tags: