పొలంలో రైతు చేయాల్సిన పనిని ఒక పెంపుడు కుక్క చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా పొలాల్లో రైతులు, ఎద్దులు లేదా కూలీలు పనిచేయడం మనం చూస్తుంటాం. కానీ ఈ వీడియోలో ఒక కుక్క పొలానికి నీరు పెట్టే పనిలో చాలా బిజీగా నిమగ్నమైంది. దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా ఆ కుక్కను “డోగేశ్ భాయ్” అని పిలుస్తున్నారు.
పొలంలో ఒక వైపు నుంచి నీరు వేగంగా పారుతోంది. ఆ నీరు పొలంలోకి సరైన దారిలో వెళ్లాలన్నట్టుగా, ఆ కుక్క నీటి కంటే ముందే పరిగెడుతోంది. నీరు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ పరిగెడుతూ, మధ్యమధ్యలో మట్టిని కూడా తవ్వుతోంది. దీనివల్ల నీరు ఆటంకం లేకుండా ముందుకు సాగుతున్న దృశ్యం చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.
ఆ కుక్క నిజంగానే పొలానికి నీరు పెట్టడంలో సాయపడుతోందా, లేక ప్రవహించే నీటిని చూసి సరదాగా ఆడుకుంటోందా అనేది వీడియోలో స్పష్టంగా తెలియనప్పటికీ… దాని హావభావాలు మాత్రం అచ్చం ఒక రైతు నీరు పారించే పనులను చేస్తున్నట్లే ఉండటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నీటి ముందు వేగంగా పరిగెత్తడం, మట్టిని తవ్వడం వంటి చేష్టలు అందరినీ నవ్విస్తున్నాయి.
ఈ వీడియోను షేర్ చేసినవారు… రైతుకు ఏదో అత్యవసర పని పడటంతో పొలానికి నీరు పెట్టే బాధ్యతను తన నమ్మకమైన “డోగేశ్ భాయ్”కి అప్పగించాడని ఫన్నీగా క్యాప్షన్లు పెడుతున్నారు. మరికొందరైతే ఈ కుక్కకు ఎంత జీతం ఇస్తున్నారని చమత్కరిస్తున్నారు. ఇది నిజంగా సాగునీటి పారకానికి సాయపడుతోందా లేదా అనేది పక్కనపెడితే, దాని ముద్దుముద్దు చేష్టలు మాత్రం ఇంటర్నెట్లో అందరినీ తెగ నవ్విస్తున్నాయి.
