రైలు ఆలస్యంగా రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వృద్ధురాలు లోకో పైలట్ (రైలు డ్రైవర్)తో గొడవపడిన వీడియో, దానికి ఆ డ్రైవర్ అంతే ప్రశాంతంగా, నవ్వుతూ సమాధానమిచ్చిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సరదా సన్నివేశం నెటిజన్లను, ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంటోంది.
ఏం జరిగింది?
రైలు కోసం చాలా సేపు వేచి చూసి అలసిపోయిన ఆ ప్రయాణికురాలి కోపం ఒకవైపు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ లోకో పైలట్ ఇచ్చిన కూల్ సమాధానం మరోవైపు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సంఘటన జరిగిన రోజు నిర్ణీత సమయానికి రైలు రాకపోవడంతో ఆ వృద్ధురాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రైలు వచ్చి స్టేషన్లో ఆగగానే నేరుగా డ్రైవర్ క్యాబిన్ వద్దకు వెళ్లిన ఆమె.. “ఏంటయ్యా.. రైలు ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? జనాలు ఎంతసేపు కాచుకుని కూర్చోవాలి?” అని ఆవేశంగా నిలదీశారు.
డ్రైవర్ సమాధానంతో సల్లబడిన కోపం!
ప్రయాణికుల తరఫున మాట్లాడిన ఆ వృద్ధురాలి కోపంలో న్యాయం ఉన్నప్పటికీ, ఆమె మాట్లాడిన తీరు అక్కడ ఉన్నవారిని కాసేపు కంగారు పెట్టింది. అయితే, ఆ రైలు డ్రైవర్ మాత్రం ఏమాత్రం కోప్పడకుండా ఎంతో శాంతంగా వ్యవహరించారు. వృద్ధురాలి చేయి పట్టుకుని సర్దిచెబుతూ, చిరునవ్వుతో సరదాగా మాట్లాడి ఆ వాతావరణాన్ని తేలికపరిచారు.
సాంకేతిక లోపాలు లేదా సిగ్నల్ ఆలస్యం వంటి సమస్యలు ఏవైనా సరే, ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే తమకు ముఖ్యమని ఆయన నవ్వుతూ వివరించిన తీరు.. అంత కోపంలో ఉన్న ఆ వృద్ధురాలి ముఖంలో కూడా చిరునవ్వులు పూయించింది. ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

Leave a Reply