సాధారణంగా రైళ్లు ప్రయాణించే పట్టాల మధ్య ఖాళీ స్థలాన్ని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చా? స్విట్జర్లాండ్ ఈ ఆలోచనను ఆచరణలో పరీక్షిస్తోంది. రైల్వే ట్రాక్‌ల మధ్య సౌర విద్యుత్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసి, సూర్యరశ్మి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వినూత్న ప్రయోగం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రైలు పట్టాల మధ్య సోలార్ ప్యానెల్స్!
స్విట్జర్లాండ్‌లోని బట్జ్ ప్రాంతంలో సుమారు 100 మీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌పై 48 సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ వ్యవస్థను రూపొందించారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్థానిక విద్యుత్ పంపిణీ వ్యవస్థకు అందిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రైల్వే ట్రాక్‌లపై నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఈ ప్యానెల్స్‌ను తొలగించి, పనులు పూర్తయిన తర్వాత తిరిగి అమర్చేలా ఈ సాంకేతికతను రూపొందించారు.
11 వేల రైళ్లు ప్రయాణించినా..
ఈ ప్రయోగం ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఆ మార్గంలో 11,000కు పైగా రైళ్లు ప్రయాణించినట్లు సమాచారం. ఈ సమయంలో సుమారు 16,000 కిలోవాట్-గంటల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అయితే, రైళ్ల రాకపోకల వల్ల ప్యానెల్స్‌కు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? దుమ్ము, మంచు కారణంగా విద్యుత్ ఉత్పత్తి ఎంతవరకు ప్రభావితమవుతోంది? నిర్వహణ ఖర్చులు ఎంత ఉంటాయి? వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇతర దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి?
రైల్వే ట్రాక్‌ల మధ్య ఇప్పటికే అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోవడం ఈ ప్రయోగంలోని ప్రధాన ప్రత్యేకత. కొత్తగా పెద్ద మొత్తంలో భూమిని సేకరించకుండానే అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంతో ఈ విధానంపై ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి.
ఫ్రాన్స్‌కు చెందిన జాతీయ రైల్వే సంస్థ సైతం ఈ సాంకేతికతను పరిశీలించేందుకు స్విస్ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.
అయితే, ఈ ప్రయోగం ఇంకా పరీక్షల దశలోనే ఉంది. భద్రత, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, నిర్వహణ సౌలభ్యం, మొత్తం ఖర్చులపై వచ్చే ఫలితాలను బట్టి ఇతర రైల్వే మార్గాలకు విస్తరించాలా లేదా అనేది నిర్ణయించనున్నారు.
రైల్వే పట్టాల మధ్య ఖాళీ స్థలాన్నే విద్యుత్ కేంద్రంగా మార్చే ఈ ఆలోచన విజయవంతమైతే, భవిష్యత్తులో రైల్వే వ్యవస్థలోనే పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి కొత్త మార్గం తెరుచుకోవచ్చు.
