రోడ్డు పక్కన ఝాల్‌ముడీ కొన్న ప్రధాని మోదీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, గూగుల్ సెర్చ్‌లో రికార్డుల వేట!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (ఏప్రిల్ 19) పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. సభ ముగించుకుని తిరిగి వస్తుండగా, పీఎం మోదీ కాన్వాయ్ కాలేజ్ మోడ్ వద్ద ఉన్న ఒక చిన్న ‘ఝాల్‌ముడీ’ (మురమురాల మిక్చర్) దుకాణం వద్ద ఆగింది.

ప్రధాని స్వయంగా కారు దిగి, అక్కడ ₹10 చెల్లించి ఝాల్‌ముడీ కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాసేపట్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

100 మిలియన్ వ్యూస్.. రికార్డు స్థాయిలో లైక్స్: ప్రధాని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, ఈ వీడియోకు 6.4 మిలియన్ల లైక్స్ రావడం విశేషం.

22 ఏళ్ల గూగుల్ రికార్డు బద్దలు: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అనుసరించిన ఈ శైలి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఝాల్‌ముడీ’ (Jhalmuri) అనే పదం కోసం గూగుల్‌లో వెతికే వారి సంఖ్య (Google Search Traffic) గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.

పిల్లలకు ఝాల్‌ముడీ తినిపించిన పీఎం: ప్రధాని మోదీ తన దుకాణం వద్దకు రావడంతో విక్రేత విక్రమ్ సావ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రధాని అతడిని ఝాల్‌ముడీ ధర అడిగి, పది రూపాయలకు ఇవ్వాలని కోరారు. విక్రమ్ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ, ప్రధాని సున్నితంగా నచ్చజెప్పి ఆ పది రూపాయలను అతడికి అందించారు.

అనంతరం తాను కొన్న ఝాల్‌ముడీని అక్కడ ఉన్న చిన్నారులకు కూడా తినిపించారు. ఈ క్రమంలో స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.


Posted

in

by

Tags: