న్యూస్ డెస్క్ – స్పెషల్ రిపోర్ట్: రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, మన దేశంలో ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. గుంతల రోడ్లు, మద్యం మత్తు, అజాగ్రత్త డ్రైవింగ్ ప్రధాన కారణాలైనప్పటికీ.. సరైన ప్రథమ చికిత్స అందకపోవడం వల్లే చాలా మంది చనిపోతున్నారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం చేసే కొన్ని పనులు వారిని మృత్యువుకు దగ్గర చేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
నీరు అడిగితే ఇవ్వడం ‘మృత్యు సమానం’!
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు తీవ్రమైన షాక్‌లో ఉంటారు. ఆ సమయంలో గొంతు ఎండిపోయి “నీళ్లు.. నీళ్లు..” అని అడగడం చాలా సహజం. మానవత్వంతో మనం వెంటనే నీళ్లు ఇస్తుంటాం. కానీ, మీరు ఇచ్చే ఆ నీళ్లే వారి ప్రాణాలను తీయవచ్చు.
- ఎందుకు ఇవ్వకూడదు?: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెదడులో రక్తస్రావం (SDH) లేదా ఎముకల విరుపులు ఉండే అవకాశం ఉంటుంది. వీరికి ఆసుపత్రికి వెళ్లిన వెంటనే అత్యవసర శస్త్రచికిత్స (Surgery) అవసరమవుతుంది.
- అనస్థీషియా సమస్య: ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి అనస్థీషియా (మత్తుమందు) ఇస్తారు. ఆ సమయంలో కడుపులో నీరు లేదా ఆహారం ఉంటే, అది వెనక్కి వచ్చి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనివల్ల న్యుమోనియా రావడం లేదా శ్వాస ఆడక రోగి మరణించే అవకాశం ఉంది.
అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మరింత ప్రమాదం!
బాధితుడు స్పృహలో లేనప్పుడు వారి శరీరంలోని రక్షణ వ్యవస్థలు (Reflexes) పనిచేయవు. ఆ స్థితిలో నీరు పోస్తే అది అన్నవాహికలోకి కాకుండా నేరుగా శ్వాసనాళంలోకి వెళ్లి బాధితుడు అక్కడికక్కడే ఊపిరి ఆడక చనిపోవచ్చు.
మీరు చేయాల్సిన సహాయం ఏమిటి?
ప్రమాదం జరిగిన చోట గుంపులుగా చేరి గాలి ఆడకుండా చేయకండి. వెంటనే అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్‌కు (108 లేదా స్థానిక హెల్ప్ లైన్ నంబర్లు) కాల్ చేయండి. మీరు చేసే వేగవంతమైన స్పందన ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది.
వైద్యులు సూచిస్తున్న ప్రథమ చికిత్స చిట్కాలు:
- హెల్మెట్ తీయకండి: బైకర్ ప్రమాదానికి గురైతే, ఆసుపత్రికి చేరే వరకు వారి హెల్మెట్ తీసే ప్రయత్నం అస్సలు చేయవద్దు. హెల్మెట్ తీసే క్రమంలో మెడ లేదా వెన్నుముక పూసలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- రక్తస్రావం నియంత్రణ: గాయాల నుండి రక్తం కారుతుంటే, ఒక శుభ్రమైన గుడ్డతో ఆ గాయంపై గట్టిగా ఒత్తిడి ఉంచి రక్తం ఆగకుండా చూడండి.
- మెడ స్థిరత్వం: బాధితుడిని తరలించేటప్పుడు మెడ వంగకుండా, వెన్నుముక నేరుగా ఉండేలా జాగ్రత్త పడాలి. వీలైతే గట్టి బోర్డు లేదా స్ట్రెచర్ ఉపయోగించండి.
- వాంతులు అవుతుంటే: బాధితుడు వాంతి చేసుకుంటుంటే, ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదాన్ని నివారించడానికి వారిని పక్కకు (Side) తిప్పి పడుకోబెట్టండి.
గుర్తుంచుకోండి: బాధితుడు నీళ్లు అడిగితే గొంతు తడపడానికి కొన్ని చుక్కలు నోటిపై చల్లవచ్చు తప్ప, గ్లాసులతో నీరు తాగించడం వారి ప్రాణాల మీదకు తెస్తుంది.
