టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మూడవసారి టైటిల్ గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేస్తూ ట్రోఫీని ముద్దాడింది. అయితే, మైదానంలో గెలుపు సంబరాలు జరుపుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ మరియు అతని భార్య రితికా సజ్దేహ్కు సంబంధించిన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలేం జరిగింది? వైరల్ అవుతున్న వీడియోలో రితికా, రోహిత్ శర్మతో ఏదో విషయంపై గట్టిగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. మైదానంలో ప్రేక్షకుల గోల ఎక్కువగా ఉండటంతో ఆమె మాటలు స్పష్టంగా వినబడలేదు కానీ, ఆమె హావభావాలను చూసి నెటిజన్లు వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. స్టేడియంలో ఉన్న భారీ శబ్దం వల్ల ఆమె రోహిత్‌కు ఏదైనా విషయాన్ని బిగ్గరగా చెబుతూ ఉండవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత కొద్దిసేపటికే రితికా నవ్వుతూ కనిపించింది.
నెటిజన్ల కామెంట్స్: ఈ వీడియోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. “వీరిద్దరూ దేని గురించి గొడవ పడుతున్నారు?” అని ఒకరు ప్రశ్నించగా, “మహిళా దినోత్సవం కాబట్టి ఇంట్లో భార్య చెప్పిందే వినాలి కదా” అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు. “కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న మనస్పర్థలు సహజమే” అని మరికొందరు రోహిత్‌కు మద్దతుగా నిలిచారు.
