అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన చేసింది. గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపైనే 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయం క్రెడిట్ అంతా 101 పరుగుల అజేయ శతకంతో చెలరేగిన తిలక్ వర్మకే దక్కుతుంది. అందుకే అన్ని వైపుల నుండి తిలక్ వర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
అయితే, ఈ విజయం వెనుక తెరచాటు హీరో మాత్రం రోహిత్ శర్మ. ఎవరూ గమనించని సమయంలో రోహిత్ మైదానంలోకి వచ్చి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.
కుప్పకూలిన గుజరాత్: ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ ఆరంభం నుండే తడబడింది. సాయి సుదర్శన్ సున్నాకే అవుట్ కాగా, జోస్ బట్లర్ 5 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (14), వాషింగ్టన్ సుందర్ (26) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా ముంబై బౌలింగ్ ధాటికి నిలవలేకపోయారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత గుజరాత్ ఓటమి ఖాయమైంది. వరుసగా వికెట్లు కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ 100 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో ముంబై 99 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
తెరచాటున రోహిత్ మ్యాజిక్: ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్, ఫీల్డింగ్ మరియు బౌలింగ్ అన్నీ పక్కాగా సాగాయి. అయితే మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం.. అదే రోహిత్ శర్మ. హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. కానీ, తను గాయంతో ఉన్నప్పటికీ మైదానంలోకి వచ్చి తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ ఫీల్డింగ్ సెటప్ మరియు బౌలింగ్ మార్పుల విషయంలో చిట్కాలు అందించాడు.
ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా, గాయంతో బాధపడుతున్నా.. రోహిత్ శర్మ తెరచాటు నుండి మ్యాచ్‌ను ముంబై వైపు తిప్పాడు. ముంబై విజయంలో ఆయన పోషించిన ఈ పాత్ర చాలామంది దృష్టికి రాలేదు. అయితే, రోహిత్ శర్మ సూర్యకుమార్‌కు సలహాలు ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోహిత్ నాయకత్వ లక్షణాలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
