చెన్నైలోని అన్నాానగర్లోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్లో ఈ వింత ఘటన జరిగింది. కస్టమర్లలా లోపలికి వచ్చిన కొందరు, ఏమీ కొనకుండానే చాలాసేపు లోపల తిరిగారు. ఆ తర్వాత ఉన్నట్టుండి షాపులో వస్తువులు మాయమవ్వడం మొదలైంది. ఇది పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
అన్నాానగర్ 6వ అవెన్యూలోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్ మేనేజర్ అనిల్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. “జనవరి 19, 2026న ఇద్దరు మహిళలు కస్టమర్లలా వచ్చి, తమ లోదుస్తుల్లో వస్తువులను దాచి దొంగిలించారు. వారికి సహాయంగా మరో ఇద్దరు పురుషులు కూడా వచ్చారు” అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధారంగా సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందజేశారు.
సీసీటీవీలో దొంగతనం దృశ్యాలు
పోలీసులు విచారణ చేపట్టగా, ఐదుగురు వ్యక్తులు సూపర్ మార్కెట్‌కు వచ్చినట్లు కెమెరాలో రికార్డయ్యింది. ఆ ఐదుగురు టీ పౌడర్, ఆయిల్ ప్యాకెట్లు వంటి నిత్యావసర వస్తువులను తమ బట్టల లోపల దాచుకుని బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపించింది.
వీరు గత 10 ఏళ్లుగా తమిళనాడువ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇదే పద్ధతిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పెద్ద వస్తువులను సులభంగా దాచుకోవడానికి వీలుగా ఈ మహిళలు లోపల అనేక జేబులు ఉన్న ప్రత్యేకమైన ‘విశాలమైన పావడాలను’ కుట్టించుకుని ధరిస్తున్నట్లు గుర్తించారు.
దోపిడీ పద్ధతి ఇదే..
వీరు ఇటీవల చెన్నై వచ్చి వడపళనిలోని ఒక లాడ్జిలో దిగారు. దొంగిలించిన వస్తువులను ట్రావెల్స్ బస్సుల ద్వారా తమ సొంత ఊళ్లకు పార్శిల్ పంపేవారు. అక్కడ వీటిని అమ్మి సొమ్ము చేసుకునేవారు. వీరి నుంచి పోలీసులు ఒక కారు, కత్తి మరియు లోపల జేబులు ఉన్న రెండు ప్రత్యేక పావడాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముఠా కోసం పోలీసులు వెతుకుతుండగానే, అన్నాానగర్లోని మరో సూపర్ మార్కెట్ మేనేజర్ కృష్ణకుమార్ కూడా ఇదే విధమైన ఫిర్యాదు చేశారు. అలాగే, మరో పండ్ల దుకాణం మేనేజర్‌ను కారులో కిడ్నాప్ చేసి రూ. 2,500 దోచుకున్నట్లు ఫిర్యాదు రావడంతో, ఈ మూడు నేరాలకు పాల్పడింది ఒకే ముఠా అని పోలీసులు నిర్ధారించారు.
నిందితుల వివరాలు
ఈ కేసులో తేని జిల్లాకు చెందిన ధనలక్ష్మి (50), నాగమ్మాళ్ (70) అనే మహిళలతో పాటు మధురైకి చెందిన మురుగన్ (58), కరణ్ కుమార్ (25), వేలూరుకు చెందిన ముదాసిర్ (40)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ముఠా సభ్యులు గుంపులుగా రావడం వల్ల షాపు సిబ్బంది వీరిని గమనించలేకపోయేవారు. వస్తువులు తగ్గినట్లు స్టాక్ చెక్ చేసినప్పుడు తెలిసినా, అది వీరి పనే అని ఎవరికీ అనుమానం రాలేదు. అందుకే పదేళ్లుగా వీరు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఐదుగురిని విచారిస్తున్నారు.
