విదేశాల్లో ఉద్యోగం చేస్తూ చేతినిండా సంపాదించడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం చాలామందికి కల. అయితే, ఆ సంపద మానసిక ప్రశాంతతను ఇస్తుందా? అనే చర్చను జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ రేకెత్తించింది.
పదేళ్లకు పైగా విదేశాల్లో నివసిస్తున్న ఆమె, అక్కడ ఆర్థికంగా ఎంతో సురక్షితంగా ఉన్నప్పటికీ.. బంధువుల పలకరింపులు, సామాజిక అనుబంధాలు లేక తలెత్తే ఒంటరితనం తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“జర్మన్ భాష నేర్చుకుని, అక్కడి సమాజంతో కలిసి జీవిస్తున్నప్పటికీ, లోలోపల ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంది” అని ఆమె పేర్కొన్నారు. అందుకే తన భర్త మరియు చంటిపాపతో కలిసి తిరిగి భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి (Tier-2 City) మారిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లు పంచుకున్నారు.
సొంత ఊరిలో దొరికే ఆత్మీయత కోసం..
సొంత ఊరిలో ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ, ఇరుగుపొరుగు వారి పలకరింపులు మరియు సామాజిక బంధాలు ఐరోపా దేశాల్లో కనిపించడం కష్టమని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “మేము ఇక్కడ బాగానే సంపాదిస్తున్నాం, వారాంతాల్లో సరదాగానే గడుపుతున్నాం; అయినప్పటికీ, భారతదేశంలో లభించే ఆ ఆత్మీయ అనుబంధాన్ని ఇక్కడ అనుభవించలేకపోతున్నాం” అని ఆమె వ్యక్తం చేసిన బాధ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
విదేశీ జీవితాన్ని వదులుకుని, మనశ్శాంతి కోసం మాతృభూమికి తిరిగి రావాలనే ఆమె నిర్ణయం.. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న చాలామంది భారతీయుల మనస్థితికి అద్దం పడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
