భార్య బతికి ఉండగానే మరో మహిళతో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిపై, ఆ మహిళ వరకట్న వేధింపుల చట్టం (IPC సెక్షన్ 498A) కింద కేసు నమోదు చేయవచ్చా? ఈ కీలక న్యాయపరమైన అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు లోతైన విచారణ జరపాలని నిర్ణయించింది.
కేసు నేపథ్యం: భారతీయ శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 498A ప్రకారం.. కేవలం ఒక భార్య మాత్రమే తన భర్త లేదా అతని బంధువులపై వరకట్నం లేదా వేధింపుల గురించి ఫిర్యాదు చేయవచ్చు. అయితే, హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు మహిళలకు చట్టబద్ధమైన భర్తగా ఉండలేడు. మరి ఈ పరిస్థితుల్లో లివ్-ఇన్ భాగస్వామిని ‘భార్య’గా పరిగణించవచ్చా అనేది ఇక్కడ ప్రశ్న.
జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ఎన్.కె. సింగ్‌లతో కూడిన ధర్మాసనం డాక్టర్ లోకేష్ బి.హెచ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. లోకేష్‌కు 2000లో నవీనతో వివాహమైంది. అయితే 2010లో తీర్థ అనే మహిళతో కూడా ఆయన వివాహం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి (ఇది చట్టబద్ధంగా చెల్లదు). తీర్థ 2016లో లోకేష్‌పై వరకట్నం కోసం తనను తగులబెట్టే ప్రయత్నం చేశారని కేసు పెట్టారు. లోకేష్ వాదన ప్రకారం.. తీర్థతో తనకు ఎటువంటి చట్టబద్ధమైన వివాహ బంధం లేదని, ఆ సమయంలో తాను ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్నానని ఆధారాలు చూపారు.
కర్ణాటక హైకోర్టు ఈ కేసును కొట్టివేయడానికి నిరాకరించడంతో లోకేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన కోరిన సుప్రీంకోర్టు, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సహాయాన్ని కోరింది. అలాగే, ఈ కేసులోని సంక్లిష్టత దృష్ట్యా సీనియర్ అడ్వకేట్ నీనా నారిమన్‌ను ‘అమికస్ క్యూరీ’ (కోర్టుకు సహాయకారి)గా నియమించింది.
