టెహ్రాన్/బీరుట్: మధ్య ప్రాచ్యంలో (Mid-East) మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా ‘కాల్పుల విరమణ’ (Ceasefire) ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులు పశ్చిమ ఆసియాను మళ్ళీ మంటల్లోకి నెట్టాయి.
నిప్పు రాజేసిన ఇజ్రాయెల్ దాడులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. తాజా వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 89 మంది మరణించగా, సుమారు 700 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని బీరుట్ సహా ప్రధాన నగరాల్లోని నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రులు బాధితులతో నిండిపోగా, శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం.
హోర్ముజ్ జలసంధి దిగ్బంధం.. ఇరాన్ హెచ్చరిక!
లెబనాన్‌పై దాడులు ఆపకపోతే అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని తుంగలో తొక్కడానికి వెనుకాడబోమని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది.
- ఆయిల్ ట్యాంకర్ల నిలిపివేత: నిరసనగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో ఆయిల్ ట్యాంకర్ల కదలికలను ఇరాన్ నిలిపివేసింది. ఇది ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేసింది.
- ఉల్లంఘన ఆరోపణలు: తమపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోందని, సీజ్ ఫైర్ వాతావరణాన్ని దెబ్బతీస్తోందని ఇరాన్ మండిపడుతోంది.
అమెరికా పొంతన లేని సమాధానం!
ఈ వివాదంపై వైట్ హౌస్ స్పందిస్తూ వింత వాదనను తెరపైకి తెచ్చింది.
“అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ కేవలం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం. ఇందులో లెబనాన్ భాగం కాదు.” – వైట్ హౌస్
మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. హిజ్బుల్లాను అణిచివేసే వరకు లెబనాన్‌లో దాడులు ఆపబోమని స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందాన్ని సమర్థిస్తూనే.. లెబనాన్‌లో తన పంథాను కొనసాగిస్తామని పేర్కొంది.
ప్రపంచం ఎదురుచూపులు.. శాంతి సాధ్యమేనా?
సుమారు 40 రోజుల తీవ్ర ఉద్రిక్తతల తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య 14 రోజుల తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి వచ్చిన కఠిన ప్రకటనలు చూస్తుంటే, ఈ ‘సీజ్ ఫైర్’ ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే, ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
