మెక్సికో దేశం మాంటెర్రీ నగరంలో సంభవించిన కొండచరియల విరిగిపాటుపై రిపోర్టర్ అల్మా డి లా రోసా ఫ్లోరెస్, ఆమె సహోద్యోగి క్రిస్టో మోరేల్స్ ఇద్దరూ లైవ్‌లో (ప్రత్యక్ష ప్రసారంలో) వార్తలను కవర్ చేస్తున్నారు.
ఆ సమయంలో వెనుక ఉన్న శిథిలాల మధ్య ఊహించని విధంగా అదుపు తప్పిన ఓ పికప్ ట్రక్ వాహనం, అత్యంత వేగంగా దూసుకొచ్చి వారిద్దరినీ బలంగా ఢీకొట్టింది.
ఈ షాకింగ్ ఘటనలో ఇద్దరూ రాతి గోడను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో లైవ్ ప్రసారం వెంటనే నిలిచిపోయింది.
న్యూస్ స్టూడియోలో ఉన్న యాంకర్ మారియో గోమెజ్, వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి అత్యవసర వైద్య సహాయం పంపాలని ప్రొడక్షన్ బృందాన్ని కోరారు. అదృష్టవశాత్తూ, ‘గామావిజన్’ న్యూస్ సంస్థకు చెందిన ఈ ఇద్దరు రిపోర్టర్లు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రథమ చికిత్స సిబ్బంది సహాయంతో అల్మా స్వయంగా నడుచుకుంటూ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే తరహాలో ఇటీవల పోలాండ్‌లోనూ ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది! పోలాండ్‌లోని కోసియెర్జినా ప్రాంతంలో కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ప్రమాదం గురించి రిపోర్టర్ మిలోస్ సిలివోన్సిక్ లైవ్‌లో వార్తలు అందిస్తున్నాడు.
ఆ సమయంలో అతడి వెనుక 14 ఏళ్ల బాలిక ఈ-స్కూటర్‌పై వస్తుండగా, మరో కారు ఆమె స్కూటర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ బాలిక కారు విండ్‌స్క్రీన్‌ను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ షాకింగ్ దృశ్యాలను కెమెరామెన్ స్పష్టంగా రికార్డ్ చేయడమే కాకుండా, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా పక్కాగా రికార్డ్ చేసి పోలీసులకు అప్పగించాడు. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

Leave a Reply