టెహ్రాన్: ప్రపంచం ఇప్పటివరకు చూడని రీతిలో శక్తివంతమైన రీతిలో ఎదురుదాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ సంచలన హెచ్చరికను జారీ చేశారు.
“నిన్న అమెరికా, ఇజ్రాయేల్లపై ఇరాన్ క్షిపణులు వర్షించాయి, వారు దెబ్బతిన్నారు. నేడు వారు ఇప్పటివరకు అనుభవించని శక్తితో మేము దాడి చేస్తాం” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణిలోనే లారిజానీ బదులిచ్చారు.
పశ్చిమాసియాలో దశాబ్దాలుగా ఉన్న అధికార సమీకరణాలను మారుస్తూ, ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయేల్ ఉమ్మడి దాడుల్లో హతమార్చారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, మనవరాలు కూడా మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతికారంగా ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయేల్లోని టెల్ అవీవ్లో భారీ నష్టం వాటిల్లింది.
ముఖ్యాంశాలు:
- ట్రంప్ హెచ్చరిక: ఇరాన్ మళ్ళీ దాడి చేస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బుద్ధి చెబుతామని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా హెచ్చరించారు.
- నెతన్యాహు లక్ష్యం: ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి, రాజ్యాంగాన్ని మార్చడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని ఇజ్రాయేల్ ప్రధాని స్పష్టం చేశారు.
- జాతీయ సంతాపం: ఖమేనీ మరణంతో ఇరాన్ 7 రోజుల ప్రభుత్వ సెలవు, 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది. 1989 నుండి ఇరాన్ను నడిపిస్తున్న ఆయన తర్వాత వారసుడు ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
