ముంబై: కర్జత్ లోకల్ ట్రైన్‌లోని మహిళల సెకండ్ క్లాస్ డబ్బాలో ఒక పురుషుడు బుర్కా ధరించి ప్రయాణిస్తూ ఘాట్‌కోపర్ స్టేషన్‌లో కనిపించాడు. ఆ వ్యక్తి స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌కు వ్యతిరేక దిశలో దిగి అక్కడి నుండి పరారయ్యాడు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించిన పోలీసులు, అతడిని వెంబడించి నాసిక్‌లో అరెస్టు చేశారు. నిందితుడిని నాసిక్‌కు చెందిన అల్తాఫ్ హుస్సేన్ షేక్ (57)గా గుర్తించారు. విచారణలో నిందితుడు మానసిక అస్వస్థతతో బాధపడుతున్నాడని, 2022 నుండి వివిధ ఆసుపత్రులలో మానసిక వ్యాధి (Psychotic) కి చికిత్స పొందుతున్నాడని తేలింది. నిందితుడిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) పట్టుకుని, తదుపరి చర్యల కోసం ఘాట్‌కోపర్ ఆర్‌పీఎఫ్ (RPF)కు అప్పగించారు.
మహిళల కోసం కేటాయించిన బోగీల్లోకి పురుషులు ఎక్కవద్దని, అలా చేసేవారిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే హెచ్చరించింది. ఇటువంటి అసాధారణ సంఘటనలు జరిగితే వెంటనే రైల్వే సిబ్బందికి లేదా హెల్ప్‌లైన్ నంబర్ 139 కి సమాచారం ఇవ్వాలని కోరింది.
‘బెంగాలీ బాబా’ అరెస్ట్:
రైలు బోగీల్లో మరియు రైల్వే ప్రాంగణాల్లో అక్రమంగా ప్రచార సామాగ్రిని అంటించడం మరియు పంపిణీ చేస్తున్నాడనే ఆరోపణలతో ‘బెంగాలీ బాబా’ ముసుగులో తిరుగుతున్న ఒక వ్యక్తిని సెంట్రల్ మరియు వెస్ట్రన్ రైల్వే ఆర్‌పీఎఫ్ బృందం అరెస్టు చేసింది.
నమ్మదగిన సమాచారం మేరకు రే రోడ్ సమీపంలోని మీరా అలీ దర్గాపై జరిపిన దాడిలో మొహమ్మద్ నజీర్ అందాడీ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రైళ్లలో అంటించే సుమారు 15,000 పోస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
