పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఒక ఆసక్తికరమైన మరియు ఆహ్లాదకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ నియోజకవర్గ ఎంపీ ప్రియా సరోజ్, తన ప్రసంగంతో కేంద్ర ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేయడమే కాకుండా, తన ప్రాంతీయ భాషా సౌరభంతో సభను మురిపించారు. బిల్లు అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూనే, ఆమె మాట్లాడిన ‘అవధ్’ భాషా శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
“ఇప్పుడే కావాలి.. భవిష్యత్తులో కాదు!”
మహిళా రిజర్వేషన్ బిల్లు టైమింగ్‌పై ప్రియా సరోజ్ నిప్పులు చెరిగారు. “త్వరపడి తీసుకునే నిర్ణయాలు చరిత్రలో తప్పిదాలుగా మిగిలిపోతాయి.. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు దేశ తలరాతను మారుస్తాయి” అంటూ ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే వెంటనే 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ఆమె కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇది నిజంగా మహిళా సాధికారత కోసమేనా? లేక రాజకీయ ప్రయోజనాల కోసమా? అని నిలదీశారు.
వైరల్ వీడియో: “బోలత్ హయీ దూ మినిట్ రుకా…”
ప్రసంగం కొనసాగిస్తున్న సమయంలో సమయం ముగుస్తోందని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ వారించగా.. ప్రియా సరోజ్ తన స్థానిక అవధ్ భాషలో ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రియా సరోజ్ వ్యాఖ్య: “కన్ క్లూడ్ కరత్ హయీ.. కరే దా హమకే పహిలే.. బస్ బోలత్ హయీ దూ మినిట్ రుకా…” (ముగిస్తున్నాను.. నన్ను మాట్లాడనివ్వండి.. ఇంకో రెండు నిమిషాలు ఆగండి..)
ఆమె భాషా శైలి, ఆ యాస విన్న సభలోని సభ్యులందరూ ఒక్కసారిగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.
స్పీకర్ భోజ్‌పురి కౌంటర్!
ప్రియా సరోజ్ యాసకు ఫిదా అయిన జగదాంబికా పాల్ కూడా ఏమాత్రం తగ్గకుండా భోజ్‌పురిలో సమాధానమిచ్చారు. “కూల్ బాత్ ఆ గయీల్…” (అన్నీ విషయాలు వచ్చేసాయిలే..) అని ఆయన అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత కూడా ప్రియా సరోజ్ తన ప్రసంగాన్ని ముగిస్తూ.. “మహిళా హక్కుల విషయంలో దాగుడుమూతలు వద్దు.. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయండి” అని డిమాండ్ చేశారు.
నెటిజన్ల ఫిదా!
పార్లమెంట్ వంటి అత్యున్నత వేదికపై మన సంస్కృతిని, భాషను ప్రతిబింబించేలా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రియా సరోజ్ ధైర్యంగా తన గళాన్ని వినిపించడమే కాకుండా, తన మూలాలను మర్చిపోకుండా వ్యవహరించిన తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
