న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను ఏకంగా 850కి పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక బిల్లుపై చర్చించేందుకు ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక బీజేపీ భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందంటూ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.
అసలు లెక్కలేంటి? ఉత్తరాది వర్సెస్ దక్షిణాది
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరిగితే దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయని కపిల్ సిబల్ గణాంకాలతో వివరించారు.
- తమిళనాడు: ప్రస్తుతం 39 సీట్లు ఉండగా, పునర్విభజన తర్వాత ఈ సంఖ్య 59కి చేరుతుంది.
- ఉత్తరప్రదేశ్: ప్రస్తుతం 80 సీట్లు ఉండగా, పునర్విభజన తర్వాత ఏకంగా 120కి పెరుగుతాయి.
- వ్యత్యాసం: ప్రస్తుతం యూపీ, తమిళనాడు మధ్య ఉన్న 41 సీట్ల తేడా.. పునర్విభజన తర్వాత 61కి పెరుగుతుంది.
అంటే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయ లబ్ధి కోసమేనా?
2029 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకే బీజేపీ ఈ అస్త్రాన్ని ప్రయోగించిందని కపిల్ సిబల్ ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని 238 స్థానాల్లో 127 సీట్లు గెలుచుకున్న బీజేపీకి, దక్షిణాదిలోని 130 స్థానాల్లో కేవలం 29 సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అందుకే ఉత్తరాదిలో సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరం లేకుండానే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది బీజేపీ ప్లాన్ అని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరిక:
కేంద్రం నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఈ పునర్విభజన ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాది ఆధిపత్యం పెంచే ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని, దీనిపై తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామని స్టాలిన్ హెచ్చరించారు.
మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏది?
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రానికి నిజమైన ఆసక్తి లేదని సిబల్ విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లల్లోనే రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, కానీ పునర్విభజన సాకుతో దానిని 2029 వరకు వాయిదా వేయడమేంటని ప్రశ్నించారు. అలాగే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం.. ప్రతిపక్షాల ప్రచారాన్ని అడ్డుకోవడమేనని ఆయన దుయ్యబట్టారు.
పునర్విభజన కమిషన్ పూర్తిగా బీజేపీ నియంత్రణలోనే ఉందని, జమ్మూ కాశ్మీర్ మరియు అస్సాంలలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనమని కపిల్ సిబల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు భారత రాజకీయాల్లో సరికొత్త రణక్షేత్రానికి నాంది పలికింది.
