“వంట చేయమన్నందుకే ఇంత దారుణమా..?” కోపంతో భార్యపై దాడి చేసిన భర్త..! 9 మంది పిల్లల తల్లి మృతి. తల్లిని కోల్పోయి అనాథలైన పిల్లలు.!!!

జార్ఖండ్ రాష్ట్రం జామ్‌తారా జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా 9 మంది పిల్లల తల్లి హత్యకు గురైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

నారాయణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌహతియా గ్రామానికి చెందిన మనోజ్ రజ్వార్ భార్య బసంతి దేవి. వీరికి కుటుంబ విషయమై తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గురువారం రాత్రి వంట చేసే విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ఈ గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చి బసంతి దేవి ప్రాణాలు కోల్పోయింది.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, వాగ్వాదం సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మనోజ్, తన భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి, ఆపై గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బసంతి దేవి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోయిన తర్వాత మనోజ్ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై పోలీసులకు సమాచారం అందించారు.

బసంతి దేవి, మనోజ్ దంపతులకు మొత్తం 9 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా, మిగిలిన ఏడుగురు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. తల్లి మృతి చెందడం, తండ్రి గాయపడి ఆసుపత్రిలో ఉండటంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

సమాచారం అందుకున్న నారాయణ్‌పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బసంతి దేవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మనోజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే, ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కేవలం వంట చేసే విషయంలో జరిగిన గొడవే ఈ దారుణానికి కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: