మణిపురి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మణిపురి జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు మరిది అయ్యే వ్యక్తి తన వదినను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వారిద్దరూ కలిసి లూడో ఆడుతున్న సమయంలో జరిగిన చిన్న గొడవ ఈ హత్యకు దారితీసింది.
మార్చి 10న జరిగిన ఈ ఘటనలో, నిందితుడు తన వదిన ఫోన్లోని సిమ్ కార్డును తీసుకుని పరారయ్యాడు. పోలీసులు సిమ్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి, సోమవారం (మార్చి 23) నిందితుడిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది? కుర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని డేల్హా గ్రామంలో సౌరభ్ చౌహాన్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆయనకు 2016లో పూనమ్‌తో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. సౌరభ్ అహ్మదాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, పూనమ్ తన మామ మరియు కుమారుడితో కలిసి గ్రామంలో ఉంటోంది. మార్చి 10న పూనమ్ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు పూనమ్ మృతదేహం ఇంట్లోని నేలపై పడి ఉండటం కనిపించింది.
మరిదిపై పోలీసుల అనుమానం: మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపిన పోలీసులు, మృతురాలి మొబైల్ నుండి సిమ్ కార్డు మాయమవ్వడాన్ని గమనించారు. దర్యాప్తులో భాగంగా ఈ హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని, సౌరభ్ వరుసకు తమ్ముడయ్యే రిషబ్ ఈ పని చేశాడని తేలింది. రిషబ్ ఇల్లు సౌరభ్ ఇంటి పక్కనే ఉంటుంది. రిషబ్ ఇంకా పెళ్లి కాలేదు, తన తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటుంటాడు.
నిందితుడు చెప్పిన హత్య కారణం: పోలీసుల విచారణలో రిషబ్ తన నేరాన్ని అంగీకరించాడు. “నేను వదిన పూనమ్‌తో కలిసి లూడో ఆడుతున్నాను. ఆ సమయంలో సరదాగా వదినను గిల్లాను (చికోటి కోశాను). దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ సంగతి మీ అన్నయ్యకు చెబుతానని నన్ను బెదిరించింది. దాంతో నాకు కోపం వచ్చి, ఆమెను వంటగదిలోకి లాక్కెళ్లి గొంతు పిసికి చంపేశాను” అని నిందితుడు తెలిపాడు.
