బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన 19 ఏళ్ల కాజల్ కుమారి అనే నవవధువు, పెళ్లయిన కేవలం రెండు నెలలకే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కాజల్‌కు గత జూన్ 19న ముజఫర్‌పూర్ జిల్లా ఘన్‌శ్యాంపూర్‌కు చెందిన అనిల్ రాయ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత మొదటిసారిగా ఆగస్టు 12న ఆమె పుట్టింటికి వచ్చింది. అయితే, వచ్చిన మరుసటి రోజే (ఆగస్టు 13న) ఆమె అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
మూడు రోజుల తర్వాత, ఆగస్టు 16 ఉదయం పుట్టింటి సమీపంలోని చెరువు గట్టుపై కాజల్ మృతదేహం కనిపించడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పెళ్లికి ముందు కాజల్‌కు అదే గ్రామానికి చెందిన సుమిత్ అలియాస్ రాజా యాదవ్‌తో ప్రేమ వ్యవహారం ఉండేదని, ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరగడాన్ని అతడు తట్టుకోలేకపోయాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాజల్‌ను దక్కించుకోలేకపోయానన్న కక్షతోనే సుమిత్ ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై సుమిత్, రామ్‌వినయ్ యాదవ్‌లతో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
