ఒకే పేరు.. ఒకే రంగంలో ఉద్యోగం.. చివరకు ఒక్కటైన రెండు మనసులు! చైనాలో ఈ వింత వివాహం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
వరుడు, వధువు ఇద్దరి పేరూ ఒక్కటే!
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే పేరు కలిగిన యువతీయువకులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళ మీడియా కథనం ప్రకారం, 33 ఏళ్ల వరుడు, 28 ఏళ్ల వధువు ఇద్దరి పేర్లూ జు షియావోకాంగ్ (Xu Xiaokang). వీరిద్దరూ అక్టోబర్ 6న వివాహం చేసుకున్నారు.
పెళ్లి ఏర్పాట్లలో పొరపాటని భావించారట!
వరుడు, వధువు పేర్లు ఒకేలా ఉండటాన్ని చూసి మొదట కొందరు బంధువులు ఆశ్చర్యపోయారట. పెళ్లి ఏర్పాట్లు చేసినవారు ఏదైనా పొరపాటు చేశారా? అని సందేహించారని వధువు తెలిపినట్లు కథనం పేర్కొంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ దంపతులిద్దరూ పౌర విమానయాన రంగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఒకే పేరు ఉండటంతో పాటు, ఒకే రంగంలో ఉద్యోగాలు చేయడం కూడా యాదృచ్ఛికమేనని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి?
ఈ జంటకు సంబంధించిన వార్త వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరికి పుట్టబోయే బిడ్డకు ‘కాంగ్ కాంగ్’ అని పేరు పెట్టాలని కొందరు సరదాగా సూచిస్తున్నారు.
ఒకే పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారడం నిజంగా అరుదైన యాదృచ్ఛికమేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply