డిల్లీ: ఫ్రాన్స్, జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాల్లో నెస్లే సంస్థ తన బేబీ ఫుడ్ పౌడర్ (ఫార్ములా)ను వెనక్కి తీసుకుంది (Recall). “సెరూలైడ్” అనే విషపూరిత పదార్థం ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో నెస్లే ఈ నిర్ణయం తీసుకుంది. సెరూలైడ్ ఎంత ప్రమాదకరమో, ఇది ఇతర ఆహార పదార్థాల్లో ఎలా చేరుతుందో ఇప్పుడు చూద్దాం.
నెస్లే ప్రకటన: 12 నెలల లోపు పిల్లలకు తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ఫార్ములా పాలలో సెరూలైడ్ ఉన్నట్లు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే, స్వల్ప అనుమానం రావడంతో ముందు జాగ్రత్తగా నెస్లే ఈ పౌడర్లను మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది. వినియోగదారులు ఎవరైనా ఈ పౌడర్ కలిగి ఉంటే పిల్లలకు ఇవ్వవద్దని కంపెనీ కోరింది.
ఏమిటీ సెరూలైడ్? సెరూలైడ్ (Cereulide) అనేది నేలలో ఉండే ‘బాసిల్లస్ సెరియస్’ (Bacillus cereus) అనే బాక్టీరియా ద్వారా ఉత్పన్నమయ్యే అత్యంత ప్రమాదకరమైన విషం. బియ్యం, పాలు, మాంసం వంటి ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోయినా లేదా తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా ఇది ఏర్పడుతుంది. ముఖ్యంగా గది ఉష్ణోగ్రత వద్ద పిండి పదార్థాలు (Starch) ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచినప్పుడు ఈ బాక్టీరియా చురుగ్గా మారి విషాన్ని విడుదల చేస్తుంది.
ఈ విషం యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే, ఇది వేడిని తట్టుకోగలదు. ఇతర బాక్టీరియాల వలె ఇది అధిక ఉష్ణోగ్రత వద్ద నశించదు. కాబట్టి ఆహారాన్ని ఎంత ఉడికించినా లేదా వేడి చేసినా ఈ విషాన్ని నాశనం చేయలేము.
లక్షణాలు: సెరూలైడ్ ఉన్న ఆహారం తీసుకున్న 1 నుండి 6 గంటల లోపు వాంతులు, వికారం, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది శరీరంలోని కణాల శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియా (Mitochondria)పై దాడి చేసి కణ మరణానికి దారితీస్తుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. చిన్నపిల్లల్లో ఇది భవిష్యత్తులో మధుమేహం (Diabetes) వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
నివారణ ఎలా?
- వండిన ఆహారాన్ని ఎప్పుడూ 60 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో లేదా 4 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో (ఫ్రిజ్) నిల్వ చేయాలి.
- వండిన ఆహారాన్ని రెండు గంటల లోపు ఫ్రిజ్లో పెట్టాలి.
- సెరూలైడ్ ఒకసారి ఆహారంలో ఏర్పడితే దానిని వేడి చేయడం ద్వారా తొలగించలేము, కాబట్టి ఆహారం పాడవకుండా చూసుకోవడమే ఏకైక మార్గం.
