‘వాజినస్మస్’ (Vaginismus) అనే లైంగిక సమస్యతో బాధపడుతున్న మహిళలు పెళ్లయిన లేదా సంబంధంలోకి అడుగుపెట్టిన సగటున 3.23 సంవత్సరాల తర్వాత వైద్య సహాయం పొందుతున్నారు. వీరిలో 9 శాతం మంది ఆందోళన (Anxiety) లేదా నిరాశ (Depression)కు గురవుతున్నారని దేశంలోని ఐదు నగరాల్లో జరిగిన ఒక పరిశోధనలో తెలిసింది.
ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళల్లో 30.9 శాతం మంది లైంగిక చర్యలో పాల్గొనలేకపోతున్నారు అని పరిశోధన పేర్కొంది.
ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ శాస్త్ర జర్నల్లో ప్రచురించబడిన పరిశోధన నివేదిక ప్రకారం, వాజినస్మస్తో బాధపడుతున్న మహిళల్లో 9.2 శాతం మంది ఆందోళనతో మరియు 8.6 శాతం మంది నిరాశతో బాధపడుతున్నారు.
వాజినస్మస్ అంటే, కటి ప్రాంతం (Pelvic Region) అనియంత్రితంగా కుంచించుకుపోవడం మరియు నొప్పి భయం కారణంగా లైంగిక చర్యలో పాల్గొనడం అసాధ్యం కావడం.
“వారు వ్యక్తిగత సంబంధ సమస్యల గురించి ఎవరికీ చెప్పరు. కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల వాజినస్మస్ సంభవించి ఉండవచ్చు; లేదా వాజినస్మస్ వల్ల వ్యక్తిగత సమస్యలు ఉత్పన్నమై ఉండవచ్చు. అందుకే సమస్య ఏమిటో గుర్తించడం మాకు కష్టమవుతుంది” అని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ ఐశ్వర్య రావు తెలిపారు.
ఈ సమస్య గురించి మహిళల్లో మరియు వారి తల్లిదండ్రులలో అవగాహన లేకపోవడం ఉంది. అందుకే చాలా మంది మహిళలు మౌనంగా వేదన అనుభవిస్తున్నారు.
“అవగాహన లేమి కారణంగా చికిత్స పొందే ముందు మహిళలు మౌన వేదన అనుభవిస్తారు. లోపలికి చొప్పించే వస్తువుల (Penetration) వల్ల ఆందోళన కలుగుతుందేమోనని చాలా మందికి పెద్ద భయం ఉంది. అందుకే వారు స్త్రీ జననేంద్రియ నిపుణుడి (Gynecologist) ద్వారా తనిఖీ చేయించుకోవడానికి కూడా భయపడతారు” అని మరొక పరిశోధకులు డాక్టర్ సందీప్ దేశ్పాండే అన్నారు.
ఈ సమస్యను ఎదుర్కొంటున్న మహిళలు వైద్యులను సంప్రదించడానికి వివాహం లేదా సంబంధం ఏర్పడిన తర్వాత సగటున 3.23 సంవత్సరాలు తీసుకుంటున్నారని పరిశోధన వెల్లడించింది.
“ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం వచ్చేవారిలో ఎక్కువ మంది టైర్-1 నగరాలలో నివసించే వివాహితలు లేదా సహజీవనం (Live-in) చేస్తున్నవారే. లైంగిక చర్యకు ప్రయత్నించి విజయం సాధించలేక చివరికి చికిత్స కోసం వస్తారు. మొదటిసారి చికిత్స కోసం వచ్చేవారు వివాహం లేదా సంబంధంలోకి వచ్చి 3.23 సంవత్సరాల తర్వాత వస్తున్నారు. ఇది లైంగిక ఆరోగ్య సేవలను పొందడానికి భారతదేశంలో, ముఖ్యంగా భారతీయ మహిళల్లో ఉన్న సంకోచానికి ప్రతీక” అని పరిశోధనలో పేర్కొనబడింది.
దీని కారణంగా భాగస్వామిని సంతృప్తి పరచలేకపోతున్నామనే అపరాధ భావన (Guilt) వారిని వెంటాడుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. అయితే, ఇప్పుడు కాలం మారిన కొద్దీ భర్తలు ఈ విషయంలో వైద్య సహాయం పొందడానికి తమ భార్యలకు మద్దతు ఇస్తున్నారని పరిశోధన నివేదిక తెలిపింది.
“సమస్య గురించి బహిరంగంగా మాట్లాడి నిపుణుల నుండి చికిత్స పొందేందుకు చాలా మంది భాగస్వాములు తమ భార్యలకు మద్దతు ఇవ్వడం మేము చూస్తున్నాము. నిపుణుడిని కలిసేటప్పుడు భార్యతో పాటు వారు కూడా వెళ్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, వారు భార్యకు మరింత అండగా ఉంటారు” అని పరిశోధకులలో ఒకరైన అషిమా సాహోర్ తెలిపారు.
ఐదు నగరాల్లోని వాజినస్మస్ సమస్య ఉన్న 313 మంది రోగులను విశ్లేషించి ఈ నివేదిక తయారు చేయబడింది. ఈ రోగుల గురించి సేకరించిన అత్యంత పెద్ద సమాచారం ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు.
