ప్రకృతి అందాలను చూడాలని ఉత్సాహంగా బయలుదేరిన ఆ పర్యాటక బృందాన్ని మృత్యువు లోయ రూపంలో కబళించింది. తమిళనాడులోని పొల్లాచ్చి-వాల్పారై ఘాట్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేరళకు చెందిన తొమ్మిది మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. మలప్పురం జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల బృందం ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ లోయలో పడిపోవడంతో ఈ విపత్తు సంభవించింది.
13వ హెయిర్‌పిన్ బెండ్ వద్ద మృత్యుపాశం!
పొల్లాచ్చి-వాల్పారై మార్గంలోని ప్రమాదకరమైన 13వ హెయిర్‌పిన్ బెండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మలప్పురం పాంగ్ చేండి పారమ్మల్ ఎల్పీ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా.. మలుపు వద్ద వ్యాన్ అదుపు తప్పింది. రక్షణ గోడను ఢీకొట్టి, వేగంగా లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌తో సహా మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం.
కుప్పకూలిన ప్రాణాలు..
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోవడంతో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. క్షతగాత్రులను బయటకు తీయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పొల్లాచ్చి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణం అదేనా? తీవ్రమైన మలుపు వద్ద వాహనం అదుపు తప్పడమే ప్రమాదానికి ప్రాథమిక కారణమని తెలుస్తోంది. అయితే బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేక డ్రైవర్ అజాగ్రత్త వల్ల జరిగిందా అనే కోణంలో తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విహారయాత్రకు వెళ్లి విగతజీవులుగా మారుతుండటంతో కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
