ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన ఒక పెళ్లి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. హర్చంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యారేపూర్ కన్హట్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహం ముగిసిన తర్వాత వధువు అప్పగింతల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి, అత్తారింటికి సాగనంపారు.
కానీ, అత్తారింట్లో అడుగుపెట్టిన కొన్ని గంటలకే.. శోభనం సమయానికి కాస్త ముందే వధువు స్వయంగా పోలీసులను ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వధువు మాత్రం వినడానికి సిద్ధంగా లేదు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం.. వివాహ వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. అనంతరం వధువు విడ్కోలు (అప్పగింతలు) కూడా పూర్తయ్యాయి. వధువు తన అత్తారింటికి చేరుకుంది, కానీ కొద్దిసేపటికే ఆమె యూపీ డయల్ 112 కు ఫోన్ చేసి పోలీసులను రప్పించింది.
క్షణాల్లో మారిపోయిన వాతావరణం
తాను ఎంతమాత్రం అత్తారింట్లో ఉండలేనంటూ వధువు పోలీసులకు స్పష్టం చేసింది. అప్పటివరకు ఎంతో సంతోషంగా ఉన్న పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇల్లంతా పెళ్లి సంబరాలతో కోలాహలంగా ఉన్న తరుణంలో.. ఒక్కసారిగా గొడవ వాతావరణం నెలకొంది.
ఇరు కుటుంబాలతో మాట్లాడిన పోలీసులు
హర్చంద్పూర్ ఎస్హెచ్ఓ (కోత్వాల్) ప్రవీణ్ కుమార్ సింగ్ వధువు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీనితో వధువును ఆమె తల్లిదండ్రులతో పాటు పుట్టింటికి పంపించివేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల మధ్య ఏం చర్చలు జరిగాయనే విషయాలు బయటకు రాలేదు.
మొండికేసిన వధువు
స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వరుడు, వధువు కుటుంబాలను ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేశామని తెలిపారు. అయితే, కౌన్సిలింగ్ తర్వాత కూడా వధువు వినకపోవడంతో ఆమె పుట్టింటి వారితో మాట్లాడామని, వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి అంగీకరించారని చెప్పారు. దీనితో వధువును ఆమె తల్లిదండ్రుల వెంట పంపించివేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి అత్తారింట్లో వధువుకు వచ్చిన సమస్య ఏంటనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
