ప్రపంచవ్యాప్తంగా మార్వాడీ సమాజం తమ వ్యాపార నైపుణ్యానికి, భారీ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించడంలో వారికున్న నేర్పుకు ప్రసిద్ధి. అయితే, ఈ విజయం వెనుక ఎటువంటి ‘షార్ట్‌కట్’ లేదు. దీని వెనుక ‘1,000 రోజుల నియమం’ అనే ఒక ప్రత్యేక క్రమశిక్షణ ఉంది.
చార్టర్డ్ అకౌంటెంట్ సార్థక్ అహూజా ప్రకారం.. ఏదైనా వ్యాపారం విజయవంతం అవుతుందో లేదో నిర్ణయించే ముందు, దానికి కనీసం 3 ఏళ్ల సమయం (సుమారు 1,000 రోజులు) ఇవ్వాలి.
ఈ 3 ఏళ్ల ప్రయాణం ఇలా ఉంటుంది:
అహూజా ఈ 1,000 రోజుల ప్రయాణాన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా విభజించారు:
- మొదటి 6 నుండి 12 నెలలు (నేర్చుకునే సమయం): ప్రారంభంలో లక్ష్యం లాభాలు గడించడం కాదు, పరిశ్రమను అర్థం చేసుకోవడం. మీ బిజినెస్ మోడల్‌ను పదే పదే మారుస్తూ (Iterate), తప్పుల నుండి నేర్చుకుంటూ మార్కెట్ మెలకువలను గ్రహించాలి.
- 12 నుండి 24 నెలలు (మనుగడ పరీక్ష – Survival): ఈ సమయం అత్యంత కఠినమైనది. ఆడంబరాలకు పోకుండా పొదుపుగా (Frugality) ఉండాలి. తక్కువ వనరులతో పని నడిపించాలి. తిరస్కరణలు ఎదురైనా మైదానాన్ని వదలకూడదు. ఇది మీ ఓర్పుకు అసలైన పరీక్ష.
- 24 నుండి 36 నెలలు (వ్యవస్థ మరియు టీమ్ నిర్మాణం): మూడవ ఏడాదిలో వ్యాపారం ఒక వ్యవస్థీకృత రూపాన్ని సంతరించుకుంటుంది. పనులను వేగవంతం (Efficient) చేయడం, బలమైన బృందాన్ని నిర్మించడం ద్వారా వ్యాపారంలో స్థిరత్వాన్ని తీసుకురావాలి. 3 ఏళ్లు పూర్తి కాకముందే మీరు ఓటమి ఒప్పుకుంటే, మీ ప్రయత్నాలు ‘కంపౌండ్’ (చక్రవడ్డీలా పెరగడం) అయ్యే అవకాశాన్ని మీరు కోల్పోయినట్లే.
పెట్టుబడిలో 7 ‘మార్వాడీ’ నియమాలు: కోట్లాది రూపాయల నిధిని ఎలా నిర్మించాలి?
వ్యాపారమే కాకుండా, పెట్టుబడి (Investing) విషయంలో కూడా మార్వాడీలు ‘త్వరితగతిన వచ్చే డబ్బు’ కంటే ‘స్థిరమైన డబ్బు’ను నమ్ముతారు. సీఏ నితిన్ కౌశిక్ దీనికి సంబంధించిన 7 సూత్రాలను వివరించారు:
- పెట్టుబడి రక్షణ (Capital Protection): లాభాల వెనుక పరుగులు తీసే ముందు మీ అసలు పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యం. ఎమర్జెన్సీ ఫండ్స్‌ను ఎప్పుడూ రిస్క్‌లో పెట్టకండి.
- ఆస్తులపై అతిగా మమకారం వద్దు: ఏదైనా పెట్టుబడికి సంబంధించిన పునాదులు బలహీనపడుతుంటే, భావోద్వేగాలకు లోనుకాకుండా దాని నుండి బయటకు వచ్చేయండి.
- నగదు శక్తి (Cash is King): మీ పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడూ 15-25% నగదు రూపంలో ఉంచుకోండి. మార్కెట్ పడిపోయినప్పుడు తక్కువ ధరకే షేర్లను కొనడానికి ఇది ఒక ‘ఆయుధం’లా పనిచేస్తుంది.
- నెమ్మదిగా మొదలుపెట్టి.. పెద్ద విజయం సాధించండి: స్వల్పకాలిక లాభాల కంటే దశాబ్దాల పాటు కొనసాగే ‘కంపౌండింగ్’ (చక్రవడ్డీ)పై దృష్టి పెట్టండి. ఏడాదికి 15% రాబడి వచ్చినా.. 25-30 ఏళ్లలో అది అద్భుతాలు చేస్తుంది.
- రియల్ ఎస్టేట్‌లో క్యాష్ ఫ్లో: ఇల్లు లేదా స్థలం కొనేటప్పుడు దాని ధర పెరగడం కంటే, దాని నుండి వచ్చే ‘అద్దె’ (Rental Yield)పై ఎక్కువ దృష్టి పెట్టండి.
- జీవనశైలి నియంత్రణ: ఆదాయం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచకండి. ఖర్చులను పెంచే ముందు మీ ఆస్తులను (Assets) పెంచుకోండి.
- పెట్టుబడిని ‘బోరింగ్’గా ఉండనివ్వండి: పదే పదే పోర్ట్‌ఫోలియో మార్చడం లేదా ప్రతి వార్తకు స్పందించడం మానేయండి. క్రమశిక్షణ మరియు నిలకడ మాత్రమే విజయానికి అసలైన తాళంచెవి.
