తమిళనాడు అసెంబ్లీ కొత్తగా ఎన్నికైన సభ మొదటి సమావేశంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై టీవీకే (TVK) అధినేత విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఉదయనిధి మాట్లాడుతూ.. “ప్రజల మధ్య విభేదాలు సృష్టించే సనాతనాన్ని నిర్మూలించాలి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని, మత విశ్వాసాలను అవమానిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
గతంలో (2023లో) కూడా ఉదయనిధి సనాతన ధర్మాన్ని ‘డెంగ్యూ’, ‘మలేరియా’తో పోల్చి పెద్ద వివాదానికి కారణమయ్యారు. ఉదయనిధి ప్రసంగంపై బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ ఘాటుగా స్పందించారు. గతంలో కోర్టుల నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఉదయనిధి తన పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు.
విభజన రాజకీయాలపై బీజేపీ ఆగ్రహం:
సి.ఆర్. కేశవన్ తన ప్రకటనలో.. “తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మరో రాహుల్ గాంధీలా మారుతున్నారు. రాహుల్ గాంధీ ఎలాగైతే పవిత్ర సెంగోల్‌ను ఎగతాళి చేసి, రామమందిర ప్రాణప్రతిష్ఠను బహిష్కరించారో, ఉదయనిధి కూడా అలాగే విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించడాన్ని వ్యతిరేకించే, దీపావళికి శుభాకాంక్షలు చెప్పని డీఎంకే నుండి ఇంతకంటే ఏం ఆశించగలం? తమిళనాడు రాష్ట్ర చిహ్నంలో ఆలయ గోపురం ఉంటుందని, తమిళ ప్రజలు తమ విశ్వాసాలను అవమానించడాన్ని ఎన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలి” అని అన్నారు.
సభలో ఉదయనిధి మాటలు:
ప్రతిపక్ష నేత ఉదయనిధి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “నిన్న ముఖ్యమంత్రి (విజయ్) మా నాయకుడిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ రాజకీయ మర్యాద సభలో కూడా కొనసాగాలి. మనం అధికార, ప్రతిపక్ష వరుసల్లో ఉన్నప్పటికీ తమిళనాడు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. సీఎంతో పోలిస్తే రాజకీయాల్లో మేము సీనియర్లము, మా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా సూచనలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి” అని విజయ్‌కు సూచించారు.
అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రోటోకాల్‌పై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ రాష్ట్ర గీతం కంటే ముందు ‘వందేమాతరం’ ప్లే చేయడంపై ఆయన ప్రశ్నించారు. “తమిళ రాష్ట్ర గీతానికి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉండాలి. బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో వందేమాతరం లేదు. ఇక్కడ అలా జరగడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. మన ఆచారాలను మనం కాపాడుకోవాలి. సభకు మహిళా ఎమ్మెల్యేలు రావడం సంతోషకరం. మేము తమిళనాడులో ఆరోగ్యకరమైన ప్రతిపక్షంగా ఉంటాము” అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు.
