విజయ్ విడాకులు: భార్య సంగీతను రెండేళ్లుగా మోసం చేస్తున్న దళపతి? 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

తమిళ స్టార్ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఆయన జీవితంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆయన 27 ఏళ్ల వైవాహిక బంధం ముగియబోతుందనే వార్త సంచలనం సృష్టిస్తోంది. విజయ్ భార్య సంగీత.. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో 12 పేజీల విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ఫిబ్రవరి 27, 2026న దాఖలైంది. దీనిపై మార్చి 20న విచారణ జరగనుంది. ఆ రోజున విజయ్ మరియు సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.

పిటిషన్‌లోని ప్రధానాంశాలు
సంగీత తన పిటిషన్‌లో తమ వైవాహిక జీవితం ప్రారంభంలో చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఏప్రిల్ 2021లో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. సెప్టెంబర్ 2021 నుండి ఫిబ్రవరి 2022 మధ్య కాలంలో తన లాయర్ ద్వారా విజయ్‌ను సంప్రదించి, ఆ సంబంధాన్ని ముగించుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

హామీ ఇచ్చి మాట తప్పిన విజయ్
సంగీత ఆరోపణల ప్రకారం.. ఆ సంబంధాన్ని తెంచుకుంటానని విజయ్ అప్పట్లో భరోసా ఇచ్చారు, కానీ ఆ తర్వాత కూడా దానిని కొనసాగించారు. ఈ విషయంపై తాను ప్రశ్నించినప్పుడు, విజయ్ తనపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించారని, తనను మానసిక ఒత్తిడికి మరియు అవమానాలకు గురిచేశారని ఆమె ఆరోపించారు.

బహిరంగంగానే ఆ నటితో..
సదరు నటితో కలిసి విజయ్ బహిరంగ కార్యక్రమాలకు మరియు విదేశీ ప్రయాణాలకు వెళ్లేవారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నా విజయ్ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, దీనివల్ల తాను మరియు తన పిల్లలు సమాజంలో అసౌకర్యానికి గురయ్యామని సంగీత వాపోయారు.

పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లు..
పిల్లల చదువు, వారి మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాను చాలా కాలం పాటు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని సంగీత తెలిపారు. విడాకుల నోటీసు పంపిన తర్వాత రెండుసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయిందని, నవంబర్ 9న సామరస్యపూర్వకంగా విడిపోయే ప్రయత్నం కూడా విఫలమైందని ఆమె పేర్కొన్నారు.

రహస్య విచారణకు విన్నపం
తన కేసును ‘ఇన్-కెమెరా’ (గోప్యంగా) విచారించాలని సంగీత కోర్టును కోరారు. అవసరమైతే ఆ నటితో విజయ్‌కు ఉన్న సంబంధానికి సంబంధించిన ఆధారాలను బహిరంగపరుస్తానని ఆమె హెచ్చరించారు. విజయ్ మరియు సంగీతలకు 1999లో వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ 2023 నుండి విడిగా ఉంటున్నారు.


Posted

in

by

Tags: