ఉత్తరప్రదేశ్‌లోని మథుర ప్రాంతంలో, భర్తను కోల్పోయి వితంతువుగా మారిన తన వదినను గాఢంగా ప్రేమించిన ఓ యువకుడు, వారి పెళ్లికి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
అన్న మరణించిన తర్వాత ఆధారణ లేక తల్లడిల్లుతున్న వదినకు అండగా నిలిచిన ఆ యువకుడికి, రానురాను ఆమెపై ఇష్టం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని, శాస్త్రోక్తంగా వివాహం చేసుకోవాలని భావించారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పెద్ద దుమారమే రేగింది.
సామాజిక కట్టుబాట్లు, కుటుంబ పరువు-ప్రతిష్ఠలను కారణంగా చూపుతూ వితంతువైన వదినను పెళ్లి చేసుకోకూడదని ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తన ప్రేమపై పట్టుదలతో ఉన్న ఆ యువకుడు, వదినను తప్ప మరొకరిని పెళ్లి చేసుకునేది లేదని ఇంట్లో వారితో తరచూ వాగ్వాదానికి దిగేవాడు.
కుటుంబ సభ్యుల వ్యతిరేకతకు తోడు, వారిద్దరినీ విడదీసేందుకు బంధువులు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో.. మానసిక వేదనకు, నిరాశకు గురైన ఆ యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని చూసి కంగారుపడిన కుటుంబ సభ్యులు, వెంటనే అతడిని రక్షించి సమీపంలోని ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్పించారు.
ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్న అతడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తుండగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కోసం సొంత కుటుంబాన్నే ఎదిరించి యువకుడు తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం మథుర ప్రాంతంలో విషాదాన్ని నింపడంతో పాటు హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply