థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన భారతీయ డిజిటల్ క్రియేటర్ స్పర్ష్ సునీల్.. విదేశాలలో కొందరు భారతీయ పర్యాటకులు ప్రవర్తించే తీరుపై సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా మాట్లాడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాసి ఉన్న హెచ్చరిక బోర్డును గమనించిన ఆయన.. ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పర్యాటకులు వస్తుండగా, ప్రత్యేకంగా హిందీలో మాత్రమే ఆ వాక్యాలు రాయడానికి గల కారణమేంటని హోటల్ యజమానిని అడిగారు.
దానికి ఆ యజమాని.. భారతీయ పర్యాటకులు నిబంధనలను, పద్ధతులను పాటించరని ముక్కుసూటిగా చెప్పినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, మసాజ్ సెంటర్ల బయట కొందరు భారతీయులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని, థాయ్‌లాండ్ యువతులను సెల్ఫీల కోసం వేధించడాన్ని తాను స్వయంగా చూశానని ఆయన ఆ వీడియోలో బహిరంగంగా ఆరోపించారు.
ఉత్తర భారతీయులు, దక్షిణ భారతీయులు అనే తేడా లేకుండా విదేశాలకు వెళ్లినప్పుడు మనమంతా భారతీయులమేనని, మన తప్పుడు ప్రవర్తన వల్ల దేశం పరువే పోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. క్యూలో నిలబడకపోవడం, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, స్థానిక నిబంధనలను గౌరవించకుండా గట్టిగా మాట్లాడటం వంటి కనీస ఇంగితజ్ఞానం (Civic sense) లేని పనుల వల్లే విదేశాల్లో భారతీయులకు చెడ్డపేరు వస్తోందని నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పోర్ట్ పొందే ముందే పౌర స్పృహపై శిక్షణ (Civic training) తప్పనిసరి చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ కేవలం పర్యాటకులు మాత్రమే కాదని, దేశ రాయబారులని గుర్తుంచుకోవాలని సూచించిన ఆ క్రియేటర్.. దేశ గౌరవాన్ని కాపాడేలా బాధ్యతగా, స్పృహతో వ్యవహరించాలని పర్యాటకులందరికీ హితవు పలికారు.

Leave a Reply