హర్యానా రాష్ట్రంలో, సుమారు ఒకటిన్నర ఏళ్లుగా ఎటువంటి సంరక్షణ లేక, అత్యంత దయనీయ స్థితిలో తన ఇంట్లోనే మగ్గిపోతున్న ఒక వృద్ధుడిని సామాజిక సేవా సంస్థ రక్షించింది. మానవత్వాన్ని ప్రశ్నించే ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
హర్యానాలోని కర్నాల్ నగరంలో ఒక వృద్ధుడు అత్యంత దారుణమైన స్థితిలో నివసిస్తున్నాడని ‘అప్నా ఆషియానా’ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. ఆ సంస్థ ప్రతినిధి రాజ్‌కుమార్ అరోరా నేతృత్వంలోని బృందం అక్కడికి వెళ్లగా.. ఆ వృద్ధుడు ఒక హోమియోపతి వైద్యుడని, ధనిక కుటుంబానికి చెందినవాడని తెలిసి నిర్ఘాంతపోయారు.
ఆయనను రక్షిస్తున్న సమయంలో తీసిన వీడియోలో, ఆ వృద్ధుడు గత 18 నెలలుగా బట్టలు కూడా మార్చుకోలేదని తెలిసింది. ఒళ్లంతా దుర్వాసన వస్తూ, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆయన ఒక్కరే పడి ఉన్నారు. పక్కింటి వారు మేడ మీద నుంచి చూస్తూ ఉండగా, స్వచ్ఛంద సంస్థ వారు ఆయనను అంబులెన్స్‌లో ఎక్కించారు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆయన భార్య మరియు ఇద్దరు కుమార్తెలను సంప్రదించగా.. “ఆయన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. హర్యానాలోని ఇంట్లో ఆయనను చూసుకోవడానికి ఒక సహాయకుడిని కూడా నియమించాము. కానీ ఆయన అక్కడ ఉండటానికి నిరాకరించి, పాత ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయారు” అని తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “కన్నతల్లిదండ్రుల కంటే పెద్ద సంపద ఏదీ లేదు. విదేశాల్లో సెటిల్ అయితే ఏం ప్రయోజనం? కన్న తండ్రిని ఇలాంటి పరిస్థితిలో వదిలేయడం అమానుషం” అని చాలామంది పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వృద్ధుడిని ‘అప్నా ఆషియానా’ ఆశ్రమానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
