విదేశాల నుండి వచ్చిన తండ్రిని చూసి పరిగెత్తిన చిన్నారి.. విధి నిర్వహణలో ఉంటూనే మనసు గెలుచుకున్న సిఐఎస్ఎఫ్ జవాన్!

ఎయిర్‌పోర్ట్ ఎమోషనల్ వీడియో: సాధారణంగా ఎయిర్‌పోర్ట్ అరైవల్ టెర్మినల్ అంటే హడావిడి, అనౌన్స్‌మెంట్‌లు మరియు కఠినమైన నిబంధనలతో నిండి ఉంటుంది. కానీ కొన్నిసార్లు అక్కడే మనసును హత్తుకునే అద్భుతమైన కథలు పుడుతుంటాయి.

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అధికారిక ‘X’ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో, విదేశాల నుండి తిరిగి వచ్చిన తన తండ్రిని అరైవల్ టెర్మినల్ నుండి బయటకు రావడం ఒక చిన్నారి చూస్తుంది. ఆ చిన్నారి కళ్ళలో మెరుపు, ముఖంలో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిబంధనల గురించి తెలియని ఆ చిన్నారికి తెలిసిందల్లా ఒక్కటే.. తన నాన్న వచ్చేశారని!

ఇంకేముంది, ఏమీ ఆలోచించకుండా తండ్రి వైపు పరిగెడుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఆమె దారికి అడ్డుగా ఒక సిఐఎస్ఎఫ్ జవాన్ వచ్చి నిలబడతాడు. జవాన్‌కు అక్కడ ఒక వింత పరిస్థితి ఎదురైంది. ఒకవైపు తన విధి మరియు ఎయిర్‌పోర్ట్ భద్రతా నియమాలు, మరోవైపు ఒక చిన్నారి ప్రేమ మరియు భావోద్వేగాలు. అతను ఆ చిన్నారి మనసు నొప్పించకూడదు అనుకున్నాడు, అలాగని నిబంధనలను అతిక్రమించి టెర్మినల్ లోపలికి అనుమతించలేడు. ఆ జవాన్ కోపం ప్రదర్శించకుండా చాలా సున్నితంగా వ్యవహరించాడు.

జవాన్ ఏం చేశాడంటే.. ఆ సిఐఎస్ఎఫ్ జవాన్ చిన్నారిని ప్రేమతో ఆపి, ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. “నాన్న నీకోసం ఏం తెచ్చారు?” అని అడుగుతూ ఆమెను మాటల్లో దించాడు. చిన్నారి దృష్టిని తండ్రి నుండి మరల్చి ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఆమె తండ్రి వేగంగా అరైవల్ గేట్ వైపు వచ్చారు. ఆయన బయటకు రాగానే, జవాన్ చిరునవ్వుతో ఆ చిన్నారిని వెళ్ళమని సైగ చేశాడు. మరుక్షణమే ఆ చిన్నారి తన తండ్రిని హత్తుకుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ దృశ్యం కదిలించింది. యూనిఫాం కేవలం నిబంధనలను అమలు చేయడానికే కాదు, దాని వెనుక ఒక సున్నితమైన మనిషి కూడా ఉంటాడని ఈ వీడియో నిరూపించింది.

సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు: నెటిజన్లు ఆ జవాన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. “విధి నిర్వహణలోనూ మానవత్వం” అని కొందరు, “నిజమైన మనిషి” అని మరికొందరు కొనియాడుతున్నారు. కఠినమైన బాధ్యతల మధ్య కూడా మానవత్వానికి ఎప్పుడూ చోటు ఉంటుందని ఈ ఘటన గుర్తుచేస్తోంది.


Posted

in

by

Tags: