మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణా జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి, తనతో పాటు చదువుకుంటున్న ఇద్దరు బాలికల వాటర్ బాటిళ్లలో మూత్రం కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ నీటిని తాగిన తర్వాతే అందులో ఏదో కలిసి ఉందని విద్యార్థినులు గుర్తించడంతో పాఠశాలలో తీవ్ర కలకలం రేగింది.
ఆగస్టు 17న ఆరోన్ బ్లాక్ పరిధిలోని పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితులైన విద్యార్థినులు ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (హెడ్ మాస్టర్) ఫిర్యాదు చేశారు. అయితే, “నోరు బాగాలేకపోతే పది రూపాయల చాక్లెట్ కొనుక్కుని తినండి” అంటూ హెడ్ మాస్టర్ ఉచిత సలహా ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. విద్యార్థినుల ఫిర్యాదును ఇంత నిర్లక్ష్యంగా తీసుకోవడంపై తల్లిదండ్రులు, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. నాయబ్ తహశీల్దార్, తహశీల్దార్, మండల విద్యాశాఖ అధికారి (BEO) పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, సంబంధిత వ్యక్తులను విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మండల విద్యాశాఖ అధికారి రెండు రోజుల్లోగా సమగ్ర విచారణ నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడికి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.
మరోవైపు, ఈ ఘటనను నిరసిస్తూ ఆగస్టు 18న బాధిత విద్యార్థినుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంబంధిత బాలుడిని, అతని తల్లిదండ్రులను పిలిపించి అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు మరియు నిందితుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
