బెంగళూరు, ఏప్రిల్ 20: హైదరాబాద్ నుండి హుబ్బళ్లికి వెళ్తున్న FLY91 విమానం (ATR టర్బోప్రాప్ AT7) ప్రయాణంలో ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.
అనేకమంది ప్రయాణికులు భయంతో ఏడుస్తూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాదాపు నాలుగు గంటల పాటు విమానం ఆకాశంలోనే ఉండిపోయి, ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశం కోసం వెతుకులాడింది. విమాన సిబ్బంది మరియు పైలట్లు ప్రయాణికులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు, భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని హామీ ఇచ్చారు. వాతావరణ పరిస్థితులు మరియు విమానంలో అందుబాటులో ఉన్న ఇంధనం గురించి కూడా సమాచారం అందించారు. విమానంలో ఇంకా కేవలం 30 నుండి 45 నిమిషాల ప్రయాణానికి సరిపడా ఇంధనం మాత్రమే ఉందని ప్రయాణికులకు తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకున్న పైలట్లు, విమానాన్ని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ, చివరకు సురక్షితంగా నేల తాకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
