ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. ఎడమ కాలు విరిగిన ఒక రోగికి, వైద్యులు పొరపాటున కుడి కాలుకు ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి బంధువులు, స్థానికులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.
అసలేం జరిగింది? సుతీ నియోజకవర్గం, చాంప్ఘాటి ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల రేణు బీబీ బుధవారం ఇంటి పైకప్పు నుండి కింద పడిపోయారు. ఆమెను బుధవారం రాత్రి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. ఎక్స్-రే మరియు ఇతర పరీక్షల అనంతరం ఆమె నడుము మరియు ఎడమ కాలు విరిగినట్లు తేలింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది.
ఆపరేషన్ తర్వాత ఆమెను చూసిన కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఎడమ కాలుకు ఆపరేషన్ చేయాల్సి ఉండగా, వైద్యులు కుడి కాలుకు సర్జరీ చేసి రడ్లు వేశారు. బాధితురాలి మనవడు అబ్దుల్ సెలీమ్ మాట్లాడుతూ.. “డాక్టర్లు నా నాయనమ్మ కుడి కాలును కూడా పాడు చేశారు. ఆమె ఇక ఎప్పటికీ నడవలేకపోవచ్చు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజం దాచే ప్రయత్నం? తమ తప్పు తెలుసుకున్న వైద్యులు, ఆ రోగిని వెంటనే వేరే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారని బాధితురాలి కొడుకు మహ్మద్ రోహిముద్దీన్ ఆరోపించారు. తాము నిరసన తెలపడంతో ఆమెను ప్రస్తుతానికి అక్కడే ఉంచారు. ప్రస్తుతం ఆమె ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక మెడికల్ కాలేజీలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక సామాన్య ఆసుపత్రుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఆసుపత్రి వర్గాల స్పందన: ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. వృద్ధురాలి కుడి కాలుకు ట్రాక్షన్ (Traction) కట్టి, లోపల రడ్లు వేసినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగినట్లు గుర్తించిన తర్వాత ఇప్పుడు ఎడమ కాలుకు మళ్లీ చికిత్స మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనాది రాయ్ చౌదరి స్పందిస్తూ.. “లిఖితపూర్వక ఫిర్యాదు అందితే కచ్చితంగా విచారణ జరుపుతాము. ప్రస్తుతం దీనిపై ఆరా తీస్తున్నాము” అని తెలిపారు. బాధితురాలి కుటుంబం ఇప్పటికే బెహరాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
