“వివాహం తర్వాత భార్యపై బలవంతపు శృంగారం”.. ఇది అత్యాచారమేనా..? నిర్ణయించాల్సింది ఎవరు..? సుప్రీంకోర్టు వ్యాఖ్యలేంటి..? కీలక కేసులో ఆలోచించాల్సిన అంశాలు..!

భర్త చేతిలో బలవంతపు శృంగారానికి గురయ్యే మహిళలు నిస్సందేహంగా బాధితులేనని, అయినప్పటికీ ప్రస్తుత చట్టాల ప్రకారం దానిని నేరంగా పరిగణించడానికి ఆస్కారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంపత్య జీవితంలో బలవంతపు శృంగారం (మేరిటల్ రేప్) అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కర్ణాటక హైకోర్టు విచారించిన ఒక కేసులో.. తన భార్యను లైంగిక బానిసలా చూశాడన్న ఆరోపణలతో భర్తపై అత్యాచారం సెక్షన్ల కింద విచారణ జరిపేందుకు కోర్టు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలు న్యాయ నిపుణులను ఆలోచనలో పడేశాయి. “బాధిత మహిళలకు రక్షణ కల్పించే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు. భర్త చేతిలో బలవంతపు శృంగారానికి గురయ్యే మహిళ కచ్చితంగా బాధితురాలే. అయితే, గతంలోని ఐపీసీ సెక్షన్ 375, ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల్లో వివాహం తర్వాత జరిగే బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించకుండా స్పష్టమైన మినహాయింపు ఉంది” అని ధర్మాసనం పేర్కొంది.

“చట్టం స్పష్టంగా మినహాయింపు ఇస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని ఈ సెక్షన్ కింద నేరస్థుడిగా చేర్చి విచారించడం న్యాయస్థానాల పరిధిలోకి వస్తుందా? పార్లమెంట్ రూపొందించిన చట్టంలో ఒక నిర్దిష్ట చర్య నేరం కాదని పేర్కొన్నప్పుడు, న్యాయసమీక్ష ద్వారా కోర్టులు దానిని నేరంగా మార్చగలవా?” అని న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు.

బాధిత మహిళ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదిస్తూ, ఒక మహిళను లైంగిక బానిసలా చూసే తీవ్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే హైకోర్టు ఆ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరో సీనియర్ న్యాయవాది కరుణా నంది వాదనలు వినిపిస్తూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఈ చట్టపరమైన మినహాయింపును పునఃపరిశీలించాలని లేదా సరికొత్తగా అర్థం చేసుకోవాలని కోర్టును కోరారు.

వాదనలు విన్న న్యాయమూర్తులు, “ఇది కేవలం సామాజిక నైతికతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు; పూర్తిగా రాజ్యాంగపరమైన సమస్య. సామాజిక నైతికత అంటే ఏమిటి? ప్రజలు తమ ప్రతినిధులైన పార్లమెంట్ ద్వారా చేసే చట్టాలను మేము రాజ్యాంగం ఆధారంగా పరీక్షిస్తాం. ఇందులో చట్టాలు మార్చాల్సింది ప్రజల ప్రతినిధులే తప్ప కోర్టులు కాదు. న్యాయస్థానం రాజ్యాంగ పరిధిలోని భాషలోనే మాట్లాడగలదు” అని స్పష్టం చేశారు. వివాహితల హక్కులు, అత్యాచార చట్టాల పరిధిపై మొదలైన ఈ లోతైన చర్చ న్యాయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Posted

in

by

Tags: